పారిశ్రామిక వృద్ధి.. ప్చ్!

13 May, 2015 01:33 IST|Sakshi
పారిశ్రామిక వృద్ధి.. ప్చ్!

మార్చిలో 2.1 శాతం; 5 నెలల కనిష్టస్థాయి ఇది...
2014-15 ఏడాదికి వృద్ధి రేటు 2.8%

న్యూఢిల్లీ: తయారీ, యంత్రపరికరాల రంగాలు కాస్త పుంజుకున్నప్పటికీ.. పరిశ్రమల పనితీరు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు(ఐఐపీ) 2.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.86 శాతం(సవరణకు ముందు 5%)గా నమోదైంది. అయితే, గతేడాది ఐఐపీ మైనస్ 0.5 క్షీణతలో ఉండటం గమనార్హం. మంగళవారం కేంద్రీయ గణాంకాల సంస్థ ఈ వివరాలను విడుదల చేసింది.

గతేడాది అక్టోబర్‌లో మైనస్ 2.7 శాతంగా ఉన్న ఐఐపీ.. నవంబర్‌లో 5.2 శాతం, డిసెంబర్‌లో 3.56 శాతం, జనవరిలో 2.77 శాతం చొప్పున వృద్ధి చెందింది. దీని ప్రకారం చూస్తే మార్చి గణాంకాలు ఐదు నెలల కనిష్టస్థాయి కింద లెక్క.
 
రంగాల వారీగా చూస్తే...
తయారీ: గతేడాది మార్చిలో ఈ పరిశ్రమల ఉత్పాదకత మైనస్ 1.3 శాతం కాగా.. ఈ ఏడాది మార్చిలో 2.2 శాతానికి వృద్ధి చెందింది. మొత్తం ఐఐపీ సూచీలో తయారీ వాటా 75 శాతానికిపైగా ఉంది. తయారీ రంగంలో మొత్తం 22 పరిశ్రమల విభాగాలకుగాను 13 వృద్ధి బాటలో(ఫిబ్రవరితో పోలిస్తే) ఉన్నాయి.
యంత్ర పరికరాలు: ఈ ఏడాది మార్చిలో 7.6 శాతం వృద్ధి చెందింది. గతేడాది మార్చిలో మైనస్ 11.5 శాతం భారీ క్షీణతలో ఉంది.
మైనింగ్: ఉత్పాదకత వృద్ధి 0.5 శాతం  నుంచి  0.9 శాతానికి స్వల్పంగా పెరిగింది.
విద్యుత్: ఉత్పాదకత వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది.
కన్సూమర్ గూడ్స్: మార్చిలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 0.7 శాతం క్షీణించింది. గతేడాది మార్చిలో ఈ క్షీణత మైనస్ 2.2 శాతం.
కన్సూమర్ నాన్‌డ్యూరబుల్స్: ఉత్పాదకత వృద్ధి రేటు 5 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది.
కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో క్షీణత తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చిలో ఉత్పాదకత మైనస్ 11.8% కాగా, ఈ మార్చిలో ఇది మైనస్ 4.7 శాతంగా ఉంది.
 
పూర్తి ఏడాదికి ఇలా...
గత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఉత్పాదకత మైనస్ 0.1 శాతం క్షీణించింది. ఇక తయారీ రంగం ఉత్పాదకత మైనస్ 0.8 శాతం నుంచి 2.3 శాతం వృద్ధిలోకి వచ్చింది. యంత్రపరికరాల ఉత్పాదకత కూడా మైనస్ 3.6 శాతం నుంచి 6.2 శాతం వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 8.4 శాతానికి ఎగబాకింది.
 
రేట్ల కోత అంచనాలకు బలం
రిటైల్ ధరలు ఏప్రిల్‌లో నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గడం... పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో మందగమనంలో ఉన్న నేపథ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)పై మళ్లీ పారిశ్రామిక ప్రతినిధులు, విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతల దృష్టి సారిస్తున్నారు. ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మందగించిన పారిశ్రామిక ఉత్పత్తికి ఉత్తేజాన్ని ఇవ్వడానికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఊతం అందించడానికి ఆర్‌బీఐ మరోదఫా పాలసీ రేటును తగ్గించే అవకాశం ఉందని వారు అంచనాలు వేస్తున్నారు. జూన్ 2 పాలసీ సమీక్షకు ఆర్‌బీఐ తాజా ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని భావిస్తున్నారు.
 
జనవరి నుంచీ ఆర్‌బీఐ  కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది.  అయితే ఈ ప్రయోజనాన్ని  కస్టమర్లకు బదలాయించడంలో తొలుత బ్యాంకులు వెనుకంజవేసాయి.  రెపో రేటు తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.

>
మరిన్ని వార్తలు