పరిశ్రమలు.. రివర్స్‌గేర్‌!

12 Nov, 2019 04:56 IST|Sakshi

సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం క్షీణత

ఎనిమిదేళ్ల కనిష్టానికి పతనం..!

2011 అక్టోబర్‌లో 5 శాతం మైనస్‌ మళ్లీ ఇప్పుడు అదే తీవ్రత

వరుసగా రెండు నెలలుగా నిరాశ

‘మౌలికం’సహా కీలక రంగాలన్నీ మైనస్‌లోనే...

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పట్టింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో 4.6 శాతం వృద్ధిరేటు) పారిశ్రామిక ఉత్పత్తి అసలు పెరక్కపోగా –4.3 శాతం క్షీణించిందన్నమాట.

ఇంత తీవ్ర స్థాయి క్షీణత గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ నమోదుకాలేదు. 2011 అక్టోబర్‌లో ఐఐపీ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అటు తర్వాత ఇంత తీవ్ర ప్రతికూల గణాంకం రావడం ఇదే తొలిసారి. ఆగస్టులో కూడా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతనే (–1.4 శాతం) నమోదుచేసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం. భారీ యంత్రపరికరాల ఉత్పత్తిని సూచించే క్యాపిటల్‌ గూడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి దీర్ఘకాలిక వినియోగ ఉత్పత్తులుసహా కీలకమైన తయారీ, మౌలికం, నిర్మాణం ఉత్పత్తుల్లోనూ సెప్టెంబర్‌లో ‘మైనస్‌’ ఫలితం వచ్చింది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...

► తయారీ: సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తిలో –3.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగంలో 4.8 శాతం వృద్ధి నెలకొంది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. మోటార్‌ వాహనాలు ప్రత్యేకించి భారీ, మధ్యస్థాయి వాహన ఉత్పత్తి విభాగంలో –24.8 శాతం క్షీణత నమోదయితే, –23.6 శాతం క్షీణతతో తరువాతి స్థానంలో ఫర్నిచర్‌ ఉంది.  

► విద్యుత్‌: ఈ విభాగంలో 8.2 శాతం ఉత్పత్తి వృద్ధి రేటు –2.6 క్షీణతలోకి జారింది.  

► మైనింగ్‌: గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ 0.1 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 సెప్టెంబర్‌లో వృద్ధిలేకపోగా –8.5 శాతం క్షీణత వచ్చింది.  

► క్యాపిటల్‌ గూడ్స్‌: ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 20.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతం.  

► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌:  ఉత్పత్తి –9.9 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో కూడా – 0.4 శాతం క్షీణత రావడం గమనార్హం.  

► మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో కూడా 6.4 శాతం క్షీణత నమోదయ్యింది.  

త్రైమాసికంగా –0.4 శాతం క్షీణత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో  పారిశ్రామిక ఉత్పత్తి – 0.4 శాతం క్షీణించింది. మొదటి త్రైమాసికంలో 3 శాతం వృద్ధి రేటు రాగా, 2018–19 రెండవ త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదయ్యింది.  ఇక ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ చూస్తే, దాదాపు నిశ్చలంగా 1.3%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 5.2 శాతం.

క్యూ2 జీడీపీపై ప్రతికూల ప్రభావం?
ఏప్రిల్‌–జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలోనైనా (జూలై–సెప్టెంబర్‌) కొంత మెరుగైన ఫలితం వస్తుందన్న ఆశలపై తాజా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నీళ్లు జల్లుతున్నాయి. నవంబర్‌ 29న జూలై– సెప్టెంబర్‌ జీడీపీ డేటా వెలువడనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా