ఎన్నికల ముందస్తు ర్యాలీకి చాన్స్‌!

11 Mar, 2019 00:53 IST|Sakshi

మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా 

ఈవారంలోనే పారిశ్రామికోత్పత్తి,

రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు 

ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ ఆరోరా స్పష్టం చేశారు. మార్కెట్‌ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముందుస్తు ర్యాలీకి అవకాశం మెండుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, కాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ‘షెడ్యూల్‌ ఖరారు కావడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ముగింపు దశకు చేరకుందని భావిస్తున్నాం. అయితే, ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాం’ అని అన్నారయన. నేటి నుంచే మార్కెట్లో సాధారణ ఎన్నికల వేడి మొదలుకానుండగా.. ప్రీ–పోల్‌ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఒపీనియన్స్‌ పోల్స్‌ సర్వే ఆధారంగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ వార్తలు సంస్కరణల కొనసాగింపునకు ఊతం ఇచ్చేవి అయినందున మార్కెట్‌ ప్రీ ఎలక్షన్‌ ర్యాలీకి సహకరిస్తాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థలైన యూబీఎస్, సీఎల్‌ఎస్‌ఏ భావిస్తున్నాయి. ఇక ఎవరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. సంస్కరణల కొనసాగింపు ఉంటుందనే అంచనాలతో ర్యాలీకి అవకాశం ఉందని ప్రభుదాస్‌ లీలాధర్‌ సీఈఓ అజయ్‌ బోడ్కే అన్నారు. 

గణాంకాలపై దృష్టి.. 
మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. గతేడాది డిసెంబర్‌ ఐఐపీ 2.4%గా నమోదైంది. ఇక ఈఏడాది జనవరిలో ఈ రేటు ఏవిధంగా ఉండనుందనే అంశంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. ‘సీపీఐ, ఐఐపీ డేటాపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక అంశాల్లో.. సోమవారం వెల్లడికానున్న అమెరికా రిటైల్‌ అమ్మకాలు, చైనా పారిశ్రామిక ఉత్పత్తి మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి’ అని కాపిటల్‌ ఎయిమ్‌ పరిశోధనా విభాగం హెడ్‌ దేబబ్రత భట్టాచార్జీ విశ్లేషించారు. ఇక బ్రెగ్జిట్‌ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ బిల్లు తిరస్కరణకు గురైతే సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈ అంశంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య చర్చల అంశంపై కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 

10,900–11,300 శ్రేణిలో నిఫ్టీ.. 
సాధారణ ఎన్నికలు, డాలరుతో రూపాయి మార కం విలువ కదలికలు, పలు ఎంపికచేసిన షేర్లలో ర్యాలీ మార్కెట్‌ దిశను నిర్ధేశించనున్నాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చైర్మన్‌ డీకే అగర్వాల్‌ అన్నారు. నిఫ్టీ శ్రేణి 10,900–11,300 పాయింట్ల మధ్యలో ఉండవచ్చని అంచనావేసిన ఆయన.. బ్యాంక్‌ నిఫ్టీ 27,500–28,000 పాయింట్ల స్థాయి లో కదలాడవచ్చని అంచనావేశారు. ఒకసారి నిఫ్టీ బ్రాడ్‌ రేంజ్‌ని అధిగమిస్తే.. అక్కడ నుంచి మేజర్‌ ట్రెండ్‌ను నమోదుచేస్తుందని ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ విశ్లేషించారు. ఇక 11,009–10,998 పాయింట్ల శ్రేణి కీలక మద్దతుగానూ.. 11,094–11,118 శ్రేణి కీలక నిరోధంగానూ పనిచేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటై ల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని అభిప్రాయపడ్డారు.  
 
ముడిచమురు ధరలు సానుకూలం.. 
వారాంతాన క్రూడ్‌ ధర దిగొచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ఒక శాతం నష్టాన్ని నమోదుచేశాయి. ఉత్పత్తి కోత నిర్ణయాలకు ఒపెక్‌ తలవంచే అవకాశాలు ఉన్నందున ముడిచమురు ధరలు శాంతించే సూచనలు కనిపిస్తున్నాయని కమోడిటీ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశం మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు