ఎవర్‌ గ్రీన్‌ టీ మ్యాన్‌ ఇక లేరు

1 Jun, 2019 20:53 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఏవరెడీ ఇండస్ట్రీస్   బ్రిజ్ మోహన్‌ ఖైతాన్‌  కన్నుమూత

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎవరెడీ ఇండస్ట్రీస్  మాజీ అధిపతి  బ్రిజ్ మోహన్‌ ఖైతాన్‌ (92) శనివారం  కన్నుమూశారు.  ‘ఎవర్‌ గ్రీన్‌ టీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని  పిలుచుకునే ఖైతాన్‌ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. విలిమ్‌సన్‌ మేగర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు అయిన ఖైతాన్‌.. వయసు పైబడినకారణంగా గత ఏడాది తన గ్రూప్‌నకు చెందిన ఎవరెడీ ఇండస్ట్రీస్‌, మెక్‌లాయిడ్‌ రస్సెల్‌ సంస్థల్లో ఛైర్మన్‌ పదవికి రాజీనామా  గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 

భారత్‌లోని టీ పరిశ్రమకు ఆయన్ను పెద్దదిక్కుగా భావించే బీఎం ఖైతాన్‌ మృతికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఖైతాన్‌ బెంగాలీలు అత్యంత గౌరవించే వ్యాపారవేత్త అని ఆయన మృతి  తీవ్ర విషాదాన్ని నింపిందంటూ ట్వీట్‌ చేశారు. ఆయన  కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు తన సానుభూతి  ప్రకటించారు. వ్యాపార వర్గాలకు  ఖైతాన్‌ మరణం తీరని లోటని ఐసీసీ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అటు ఖైతాన్‌ మృతికి భారత టీ అసోసియేషన్‌ కూడా సంతాపం తెలిపింది. ఆయన మృతితో ఒక శకం  ముగిసిందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒక మార్గదర్శి, నాయకుడిని టీ పరిశ్రమ కోల్పోయిందని  ప్రకటనలో పేర్కొంది 

కాగా కోలకత్తా యూనివర్సిటీ నుంచి బాచిలర్ ఆఫ్ కామర్స్‌లో పట్టా పొందిన  ఖైతాన్‌  ఎవరెడీ బ్యాటరీస్‌, మెక్‌లాయడ్‌ రస్సెల్‌ వ్యాపారంతో ఒక వెలుగు వెలిగారు. ఈ క్రమంలో పలు కీలక పదవులను  చేపట్టారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ మేనేజ్‌మంట్‌ ఇన్సిట్యూట్‌  వ్యవస్థాపక సభ్యుడుగా పనిచేశారు. 1986 -1987 మధ్యకాలంలో అంతర్జాతీయ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియన్ నేషనల్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1973లో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1994-2018 వరకు సీఈఎస్‌ఈకి స్వతంత్ర డైరక్టర్‌గా ఉన్నారు. 2013లో ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) కోల్‌కతా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న నూరేళ్ల బ్రాండ్‌ ఎవరెడీ వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. 

మరిన్ని వార్తలు