జీఎస్టీ మండలి నిర్ణయాలపై పరిశ్రమ వర్గాల హర్షం

24 Dec, 2018 05:19 IST|Sakshi

న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్‌ 23 రకాల వస్తు, సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 32 అంగుళాల టీవీలు, కంప్యూటర్‌ మానిటర్లు, వీడియోగేమ్స్, లిథియం అయాన్‌ పవర్‌ బ్యాంకులు, రీట్రేడెడ్‌ టైర్లు, వీల్‌ చైర్లు, సినిమా టికెట్లు సహా 17 రకాల వస్తువులు, ఆరు సేవలపై పన్ను శ్లాబులను కౌన్సిల్‌ మార్చింది. 28 శాతం నుంచి 18 శాతానికి, కొన్ని 18 శాతం నుంచి 12, 5 శాతానికి మార్చిన విషయం గమనార్హం. ‘‘రేట్లను గణనీయంగా తగ్గించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్‌ ఆచరణాత్మక విధానాన్ని అనుసరించింది.

ఈ నిర్ణయాలు జీఎస్టీ విధానాన్ని మరింత బలోపేతం, స్థిరపడేలా చేస్తాయి’’అని ఫిక్కీ తన ప్రకటనలో పేర్కొంది. ‘‘బలమైన వినియోగం వృద్ధిని వేగవంతం చేస్తుంది. వివిధ తరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై పన్ను రేట్ల తగ్గింపుతో  ఆ ర్థిక రంగానికి అవసరమైన ఊతం లభిస్తుంది’’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. పరోక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధికి తోడు అధిక జీఎస్టీ రేట్లను తగ్గించడం అనేవి... పన్ను చెల్లించే పరిధి పెరిగిందని, ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని తెలుస్తోందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ తల్వార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు