కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

24 Jul, 2019 10:35 IST|Sakshi

సగటున రూ. 12.8 కోట్ల నష్టం ∙ ఐబీఎం నివేదిక

న్యూఢిల్లీ: డేటా చోరీ, ఉల్లంఘనలు వ్యాపార సంస్థలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యకాలంలో డేటా ఉల్లంఘనల కారణంగా దేశీ సంస్థలు సగటున రూ. 12.8 కోట్ల మేర నష్టపోయాయి. టెక్‌ దిగ్గజం ఐబీఎం కోసం పోనిమాన్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్‌ మధ్య కాలంలో 500 పైగా సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం అంతర్జాతీయంగా డేటా చౌర్య నష్టాలు సగటున 3.92 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 27.03 కోట్లు)గా ఉన్నాయి. సగటున దేశీయంగా 35,636 రికార్డుల డేటా ఉల్లంఘన జరుగుతోంది. అంతర్జాతీయంగా ఈ సగటు 25,575 రికార్డులుగా ఉంది. డేటా ఉల్లంఘన వల్ల చట్టపరమైన, నియంత్రణ నిబంధనలపరమైన వ్యయాలు మొదలుకుని బ్రాండ్‌ పేరు దెబ్బతినడం, కస్టమర్లు ఇతర సంస్థలకు మళ్లడం, ఉద్యోగుల ఉత్పాదకత తగ్గిపోవడం దాకా వివిధ రూపాల్లో ఉండే నష్టాలను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారు. ‘భారత్‌లో సైబర్‌ నేరాల తీరుతెన్నుల్లో పెను మార్పులు వస్తున్నాయి. నేరగాళ్లు కూడబలుక్కుని ఒక పద్ధతిలో చేసే ధోరణులు పెరుగుతున్నాయి. దీంతో డేటా చౌర్యం కారణంగా వాటిల్లే నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి‘ అని ఐబీఎం ఇండియా/దక్షిణాసియా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ లీడర్‌ వైద్యనాథన్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. 

మూడింటిపై దృష్టి పెట్టాలి..
డేటా చౌర్య ముప్పు నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైబర్‌ సెక్యూరిటీపరంగా ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని అయ్యర్‌ చెప్పారు. వ్యాపార లక్ష్యాలకు పొంచి ఉండే రిస్కులను మదింపు చేసుకోవడం, ముప్పులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యవస్థను రూపొందించుకోవడం, డిజిటల్‌ విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవడంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని వివరించారు. డేటా ఉల్లంఘనలకు ఎక్కువగా క్రిమినల్‌ దాడులు (51 శాతం), సిస్టమ్‌లో లోపాలు (27 శాతం), మానవ తప్పిదాలు (22 శాతం) కారణంగా ఉంటున్నాయని నివేదికలో వెల్లడైంది. డేటా ఉల్లంఘనలను గుర్తించేందుకు పట్టే సమయం సగటున 188 రోజుల నుంచి 221 రోజులకు పెరిగింది. అయితే ఉల్లంఘనలను నియంత్రించేందుకు పట్టే సమయం 78 రోజుల నుంచి 77 రోజులకు తగ్గింది. డేటా ఉల్లంఘనల కారణంగా అత్యధికంగా నష్టపోయిన సంస్థల్లో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా హెల్త్‌కేర్‌ సంస్థలే నిల్చాయి. డేటా చౌర్య ప్రభావాలు కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాల పాటు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.   

మరిన్ని వార్తలు