ఇల్లు చక్కదిద్దండి..!

24 Jan, 2020 04:15 IST|Sakshi

రుణాలు పునర్‌వ్యవస్థీకరించాలి

స్టాంపు డ్యూటీ తగ్గించాలి

పన్నులను హేతుబద్ధీకరించాలి

గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాలి

రియల్టీ కోర్కెల చిట్టా ఇది...

దేశీయంగా రియల్టీ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే రంగాల్లో రెండో స్థానంలో ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా సుమారు 10 శాతం. రియల్టీ రంగంలో కమర్షియల్‌ లీజింగ్, లావాదేవీల వృద్ధి మెరుగ్గానే ఉన్నా.. రెసిడెన్షియల్‌ రంగం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రాజెక్టుల జాప్యం, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కుదేలవడం తదితర అంశాలతో గృహాల కొనుగోలుదారులు.. కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటూ ఉన్నారు. అటు బ్యాంకులు కూడా మొండిబాకీల వసూలు పనిలో పడి కొత్త, పాత ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో ఆఖరు దశలో నిల్చిపోయిన ప్రాజెక్టులకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 25,000 కోట్లతో ఫండ్‌ ఏర్పాటు చేయడం రియల్టీ రంగానికి కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో పాటు రాబోయే బడ్జెట్‌లో ఈ రంగానికి ఊతమిచ్చేలా తీసుకోతగిన మరిన్ని చర్యల గురించి అంచనాలు నెలకొన్నాయి.

►అన్నింటికన్నా ముందుగా కొనుగోలుదారుల్లో సెంటిమెంటు మెరుగుపర్చాలి. ఇందుకోసం గృహ రుణాలకు సంబంధించి పరిమితంగా కనీసం ఏడాది వ్యవధికైనా వడ్డీ/అసలుపై గణనీయంగా ఆదాయపు పన్ను మినహాయింపులు కల్పించవచ్చు. ప్రస్తుతం రూ. 1.5 లక్షలుగా ఉన్న మినహాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్లు కొనుగోలు చేసే అందరికీ రూ. 7.5 లక్షలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో డిమాండ్, అమ్మకాలకూ ఊతం లభించగలదు. రూ. 1.5 కోట్లు – రూ. 2 కోట్ల దాకా ఖరీదు చేసే ఇళ్ల కొనుగోలుదారులకు కూడా ప్రోత్సాహకంగా ఉండగలదు.  
►2020 మార్చి 31లోగా కుదుర్చుకున్న, నమోదు చేసుకున్న రియల్టీ లావాదేవీలపై స్టాంపు డ్యూటీ 50%  తగ్గించాలి. 
►గృహ రుణాలపై వడ్డీ రేట్లను వార్షికంగా 7 శాతం స్థాయికి తగ్గించాలి.
►బ్యాంకులు తమ విచక్షణాధికారంతో రుణాల ను పునర్‌వ్యవస్థీకరించడం లేదా మొండిబాకీలకు సంబంధించి వన్‌టైమ్‌ రోలోవర్‌ అవకాశా లను రియల్టీ రంగానికి కూడా వర్తింపచేయాలి.  
►పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు రెంటల్‌ హౌసింగ్‌ విధానానికి ఊతమివ్వాలి.  
►నిధుల లభ్యతపరమైన సవాళ్ల నుంచి రియల్టీ రంగాన్ని గట్టెక్కించాలి. ఇందుకు ద్రవ్యవిధానాలపరంగా సాహసోపేతమైన చర్యలు అవసరం. 
►పొజెషన్‌ ఇచ్చే దాకా వడ్డీని డెవలపరే భరించేలా వడ్డీ రాయితీ పథకాలను పునరుద్ధరించాలి.  
►అఫోర్డబుల్‌ హౌసింగ్‌ నిర్వచనాన్ని సవరించాలి. రూ. 45 లక్షల ధర పరిమితిని తక్షణమే తొలగించి, 60/90 చ.మీ. కన్నా తక్కువ ఉన్న అన్ని ఇళ్లకు ప్రయోజనాలు వర్తింపచేయాలి.  
►నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల విషయంలో ఆదాయపు పన్ను మినహాయింపుపరమైన మినహాయింపులు లభించకపోతుండటంతో ఆ వర్గం కొనుగోలుదారులకు సమస్యాత్మకంగా ఉంటోంది. పెండింగ్‌ ప్రాజెక్టులు మూడు–నాలుగేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న దరిమిలా.. ఆ మేరకు కొనుగోలుదారులకు కూడా పన్నుపరమైన ఊరట కల్పించవచ్చు. 
►వాణిజ్యపరమైన రియల్టీ ప్రాజెక్టుల వస్తు,సేవల పన్ను (జీఎస్‌టీ)పై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి. లీజింగ్‌ కోసం అభివృద్ధి చేసిన ప్రాపర్టీలను సర్వీస్‌ కింద పరిగణించి 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయాలు పెరిగిపోతున్నాయి.

పన్ను ప్రయోజనాలు మరిన్ని కల్పించాలి: సీఐఐ 
న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగం నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు ఊతమిచ్చేలా గృహాల కొనుగోలుదారులకు మరిన్ని పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. కనీసం 6–7% జీడీపీ వృద్ధి సాధించాలంటే రియల్టీ రంగానికి తోడ్పడేలా స్పష్టమైన ప్రణాళిక అవసరమని పేర్కొంది. దీనితో  సంఘటిత,  అసంఘటిత రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని వివరించింది.

రియల్టీకి నిధులపరమైన మద్దతుతో పాటు డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలు అవసరమని వివరించింది. ‘అన్ని ప్రాపర్టీలపై తీసుకున్న గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై గరిష్ట పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2,00,000 నుంచి రూ. 5,00,000కు పెంచాలి‘ అని పేర్కొంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకానికి ఎంఐజీ1,2 కేటగిరీల వారి ఆదాయ పరిమితిని ఇప్పుడున్న రూ.12–18 లక్షల నుంచి రూ. 18–25 లక్షలకు పెంచాలని తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా