కార్పొరేట్‌ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి

20 Jan, 2020 04:02 IST|Sakshi

రేట్లన్నింటినీ 15 శాతం శ్లాబ్‌గా మార్చాలి

కేంద్రానికి పరిశ్రమల సమాఖ్య వినతి

న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్‌ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును తగ్గించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో తగ్గుదల లేదని తెలిపారు. తయారీ, సేవా రంగాల పన్ను రేట్లలో అసమానతలు నెలకొనడమే ఇందుకు కారణమని వివరించారు.

తగ్గుతున్న శాతాలు...
1991–92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 22 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తగ్గించింది. అయితే, కంపెనీలు దీన్ని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలను వదులుకోవాల్సి ఉంటుంది. 2023 మార్చి 31లోగా ఉత్పత్తి ప్రారంభించే తయారీ సంస్థలు, 2019 అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటైన సంస్థలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు 15 శాతమే ఉంటుంది.

సర్‌చార్జీ, సెస్సు దీనికి అదనం. పలు దేశాలకు దీటుగా పోటీపడేందుకు దేశీ సంస్థలకు .. తాజా రేట్ల కోత తోడ్పడనుంది. క్రమేపీ పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లు దోహదపడనున్నాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించింది.

మరిన్ని వార్తలు