జీఎస్టీ 18% దాటొద్దు

31 Aug, 2016 01:01 IST|Sakshi
జీఎస్టీ 18% దాటొద్దు

2017 ఏప్రిల్ నుంచి కష్టమే...
తగినంత సమయం కావాలి
పారిశ్రామిక రంగం సూచనలు

 న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటు గరిష్టంగా 18 శాతంగానే నిర్ణయించాలని పారిశ్రామిక రంగం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేస్తే ద్రవ్యోల్బణం పెరగకుండానే పన్నుల ద్వారా తగినంత ఆదాయం సమకూరుతుందని సూచించింది. జీఎస్టీపై మంగళవారమిక్కడ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీతో వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన మరో ప్రధాన సూచన ఏమిటంటే... జీఎస్టీని 2017 ఏప్రిల్ నుంచి అమలు చేయడం కష్టమని, ఐటీ వసతులు సమకూర్చుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలని కోరాయి.

సేవల సరఫరా దారులు విడిగా ప్రతీ రాష్ట్రంలోనూ నమోదు చేసుకునే ఇబ్బంది లేకుండా దేశవ్యాప్తంగా ఏకీకృత నమోదుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈసీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీఎస్టీకి పార్లమెంటు ఆమోదం తర్వాత ఈసీకి ఇదే తొలి భేటీ.

 ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టాలి..: ప్రామాణిక పన్ను రేటు అన్నది సహేతుక స్థాయిలో ఉండాలి. ద్రవ్యోల్బణానికి, పన్నుల ఎగవేత ధోరణికి చెక్ పెట్టాలని ఫిక్కీ సూచించింది. పన్ను మోసాలు లేదా వసూలు చేసిన పన్నును జమ చేయకపోవడం వంటివి మినహా మిగిలిన అంశాల్లో చట్టపరమైన విచారణ, శిక్షలకు సంబంధించి నిబంధనల్లో మొదటి రెండేళ్లు సడలింపు ఇవ్వాలని అసోచామ్ కోరింది. కాగా, జీఎస్టీ విధానం నుంచి తమకు మినహాయింపు కల్పించాలని ఈ కామర్స్ రంగం నుంచి బలమైన డిమాండ్ వినిపించింది. ‘మేము వర్తకులు, వినియోగదారుల మధ్య ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంచుతున్నాం. అమ్మకాల ద్వారా ఆదాయం గడించడం లేదు. మా పోర్టళ్ల ద్వారా సరుకులను విక్రయిస్తున్నవారే జీఎస్టీ చెల్లించాలి’ అని ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమేజాన్ వాదించాయి.

18 శాతం రేటు చాలు
గరిష్టంగా 18 శాతం పన్ను రేటు అన్నది ప్రామాణికంగా భావిస్తున్నాం.  దీనివల్ల తటస్థ ఆదాయానికి తోడు పన్ను పరంగా తగినంత సానుకూలత ఉంటుంది. జీఎస్టీని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అయితే ఈ గడువుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలంటే కొన్ని నిబంధనలపై ముందుగానే స్పష్టత వస్తే వెంటనే మా సొంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను అమల్లో పెడతాం. - నౌషద్ ఫోర్బ్స్, ప్రెసిడెంట్, సీఐఐ

మరిన్ని వార్తలు