వడ్డీ రేట్లు తగ్గించాలి

18 Jan, 2019 04:31 IST|Sakshi

ద్రవ్య లభ్యత పరిస్థితులను మెరుగుపరచాలి

అప్పుడే వృద్ధికి బలం

ఆర్‌బీఐకి సీఐఐ, ఫిక్కీ సూచనలు  

న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్‌బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్‌ఆర్‌ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి.

సీఐఐ సూచనలు ఇవీ...
‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్‌ఎంఈ, ఇన్‌ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్‌ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది.

సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్‌ డిసిగ్నేట్‌ ఉదయ్‌ కోటక్‌ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్‌ సదుపాయం కల్పించే లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను (ఎల్‌ఓయూ) ఎంఎస్‌ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది.

వృద్ధిని కూడా చూడాలి...  
రెపో రేటు, సీఆర్‌ఆర్‌ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్‌ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్‌ సూచించింది. ‘‘ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్‌ తన సూచనల్లో పేర్కొంది.
మరింత కరెన్సీ అవసరం: ఆర్‌బీఐ
కోల్‌కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్‌ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు