క్యూ2 ఫలితాలే దిక్సూచి..!

14 Oct, 2019 03:50 IST|Sakshi

ఈ వారంలో దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు

సానుకూల ప్రభావం చూపనున్న అమెరికా–చైనాల పాక్షిక ఒప్పందం

నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు  

ఈ వారంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హిందుస్తాన్‌ యూనిలివర్, విప్రో, అంబుజా,  తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) విడుదలయ్యే రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల, గత శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి గణాంకాల  ప్రభావం కూడా మార్కెట్‌పై  ఉంటుందని వారంటున్నారు.  

పాక్షిక ఒప్పందం....
గత 15 నెలలుగా జరుగుతున్న అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి గత శుక్రవారం జరిగిన పాక్షిక ఒప్పందంతో ఒకింత తెరపడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమంటే ఆ ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగానే ఉంటుంది.  

నేడు రిటైల్‌ గణాంకాలు
నేడు సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. రేపు(ఈ నెల 15న) ఎగుమతుల గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 1–4న జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధాన సమావేశ వివరాలు (మినిట్స్‌)  18న(శుక్రవారం) వెల్లడవుతాయి.  

ఒడిదుడుకులు...
ఫలితాల సీజన్‌ ఆరంభమై ఇది రెండో వారం. ఈ వారంలో దాదాపు 96 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్,  హిందుస్తాన్‌ యూనిలివర్, ఎస్‌బీఐ లైఫ్, విప్రో, ఏసీసీ, జీ ఎంటర్‌టైన్మెంట్, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్, టీవీఎస్‌ మోటార్స్, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, పీవీఆర్,  ఈ జాబితాలో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్‌ మూడ్‌ను నిర్దేశిస్తాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ జిమీత్‌ మోదీ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఫలితాల వెల్లడి కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ ముస్తఫా నదీమ్‌ అంచనా వేస్తున్నారు.ఇక అంతర్జాతీయంగా చూస్తే, చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు ఈ నెల 18న వస్తాయి. అమెరికా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్‌ అమ్మకాల వివరాలు ఈ నెల 16న (బుధవారం) వస్తాయి.

6,200 కోట్ల విదేశీ నిధులు వెనక్కి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.6,200 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.4,955 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.1,262 కోట్లు చొప్పున మొత్తం రూ.6,217 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  అంతర్జాతీయ వృద్ధి భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం దీనికి కారణాలు. కంపెనీల క్యూ2 ఫలితాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభు త్వం తీసుకునే చర్యలు తదితర అంశాలపై విదేశీ నిధుల భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులంటున్నారు.

మరిన్ని వార్తలు