డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం దిగొస్తుంది

17 Nov, 2017 00:14 IST|Sakshi

మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌

హైదరాబాద్‌: ద్రవ్యోల్బణం డిసెంబర్‌ నాటికి చల్లబడుతుందని రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ చెప్పారు. అక్టోబర్‌ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం 3.58 శాతానికి చేరటం తెలిసిందే. డిసెంబర్‌ నాటికి ఇది నెమ్మదిస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 శాతం లోపే ఉంటుందని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ప్రస్తుత సీజన్‌ ముగింపు అని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల నాటికి సీజన్‌ వారీగా ధరలు తగ్గుతాయన్నారు. ‘‘వర్షాలు బాగానే ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు ఇంకా పెరగడానికి బదులు తగ్గుముఖం పడతాయి’’ అని రంగరాజన్‌ పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రంగరాజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యమైన 4 శాతం లేదంటే ఆ లోపునకే పరిమితమవుతుందన్నారు. అక్టోబర్‌లో ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలతో హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు