ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్.. కీలకం

13 Jun, 2016 01:18 IST|Sakshi
ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్.. కీలకం

రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు విడుదల...
* 14న టోకు ధరల ద్రవ్యోల్బణం...
* 15న ఫెడ్ పాలసీ సమీక్ష నిర్ణయం

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ గణాంకాలు, రుతుపవనాల విస్తరణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం... అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, గత శుక్రవారం వెలువడిన ఐఐపీ గణాం కాలు, ఆదివారం వెలువడిన చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
 
గణాంకాలతో ఒడిదుడుకులు

అంతర్జాతీయ అంశాలతో పాటు మార్కెట్ సెంటిమెంట్‌ను రుతుపవనాల విస్తరణ నిర్దేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.  మే నెల  రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు  సోమవారం(ఈ నెల 13న), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు మంగళవారం(ఈ నెల14న)న వెలువడుతాయని, ఇవి తగిన ప్రభావం చూపుతాయని వివరించారు.

ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుంది. యంత్ర పరికరాల తయారీ, తయారీ రంగ కార్యకలాపాలు మందగించడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి మైనస్ 0.8 శాతానికి తగ్గింది. గత మూడు నెలల్లో ఇదే తొలి క్షీణత కావడం గమనార్హం.
 
అందరి చూపు ఫెడ్ వైపే....
ఈ నెల 15న వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నిపుణులంటున్నారు. రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించవచ్చని అంచనాలున్నాయి. బ్రిక్జిట్ ఫలితం(యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా వద్ద అనే విషయంలో బ్రిటన్‌లో ఈ నెల 23న రెఫరెండమ్ జరగబోతోంది) ఎలా ఉండబోతోందోనన్న అంచనాల కారణంగా యూరోప్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్‌పై ఒకింత ప్రభావం చూపుతాయని మనీపామ్ సీఈఓ నిర్దోశ్ గౌర్ చెప్పారు.
 
రెండు వారాల వరుస లాభాలకు గత వారంలో బ్రేక్ పడింది. స్టాక్ సూచీలు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత  లాభాల స్వీకరణ జరిగింది.  సెన్సెక్స్ గత వారంలో 207 పాయింట్లు (0.8 శాతం) తగ్గి 26,636 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.6 శాతం క్షీణించి 8.170 వద్ద ముగిశాయి. బుధవారం(ఈ నెల14)న బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్నది. ఇక గురువారం (ఈ నెల15న) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నది.
 
విదేశీ కొనుగోళ్లు జోరు..

భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. కంపెనీల క్యూ4 ఫలితాలు సానుకూలంగా ఉండటం, వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.3,700 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు.

అంతకు ముందటి మూడు నెలల్లో(మార్చి-మే) విదేశీ ఇన్వెస్టర్లు రూ.32,000 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో(గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ) విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు