వెనెజులా...! ఎందుకిలా?

2 Aug, 2017 03:57 IST|Sakshi
వెనెజులా...! ఎందుకిలా?

పరిస్థితులకు భిన్నంగా మార్కెట్ల ర్యాలీ
2016లో ద్రవ్యోల్బణం 254%; ఇంకా పెరిగే చాన్స్‌
అయినా 1,100 శాతం పెరిగిన స్టాక్‌ మార్కెట్లు
తాజాగా ఆ దేశాధ్యక్షుడిపై అమెరికా ఆంక్షలు
ఆ వార్త వెలువడ్డాక మరో 3 శాతం ఎగసిన మార్కెట్లు
తలపండిన విశ్లేషకులకూ ఇవి ‘షాక్‌’ మార్కెట్లే!


న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలం స్టాక్‌ మార్కెట్లలో ప్రతిఫలిస్తుంది. వృద్ధి బలంగా ఉంటే, స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తుంటాయి. బలహీనంగా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కానీ, వెనెజులా స్టాక్‌ మార్కెట్లు ఇందుకు భిన్నం!. అవి పెరగాలనుకుంటే పెరుగుతాయి. తగ్గాలనుకుంటే తగ్గుతాయి. 2016లో ఆ దేశ ద్రవ్యోల్బణం 254.9 శాతం. కానీ, స్టాక్‌ మార్కెట్లు గత ఏడాది కాలంలో ఏకంగా 1,100 శాతం లాభపడ్డాయి. తాజాగా గత సోమవారం అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. దీన్ని మార్కెట్లు పాజిటివ్‌గా తీసుకున్నాయో లేక పట్టించుకోలేదో గానీ,  అదే రోజు స్టాక్‌ మార్కెట్లు 3 శాతం లాభపడ్డాయి. ఎందుకిలా...? విశ్లేషకులకు సైతం వెనెజులా స్టాక్‌ మార్కెట్లు ఓ పజిల్‌లా మారాయంటే ఆశ్చర్యం లేదు.

ఆర్థిక ఇబ్బందులు
వెనెజులాలో షామ్‌ ఎన్నికల (నామమాత్రపు) నిర్వహణకు వ్యతిరేకంగా ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మడురోపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో వెనెజులా ఒంటరిగా మారిపోయింది. కానీ, ఈక్విటీ బెంచ్‌మార్క్‌ 3,603 పాయింట్లు లాభపడి (3 శాతం) 1,39,399 పాయింట్ల వద్ద క్లోజవడం విశేషం. వెనెజులా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరు చమురే. అయితే, ఆ దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల విషయంలో అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం కుదిరితే వెనెజులాకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే ఆర్థికంగా సతమతం అవుతోంది. 2016లో జీడీపీ 18 శాతం తగ్గిపోయింది.

 2015లో 6.2 శాతం, 2014లో 3.9 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది 7.4 శాతం, వచ్చే ఏడాది 4.1 శాతం ప్రతికూల వృద్ధి నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరల పతనం, అంతర్గత సంఘర్షణలు, అసంబద్ధ విధానాలు ఇవన్నీ సమస్యలకు మూలాలు. అయినా సరే అక్కడి స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ఇక, ద్రవ్యోల్బణం కూడా మూడంకెల స్థాయిలో కొనసాగుతోంది.

1998–2008 సంవత్సరాల మధ్య 20.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2016 నాటికి ఏకంగా 254.9 శాతానికి చేరింది. ఈ ఏడాది 720.5 శాతం ఉంటుందని, 2018లో 2,068 శాతం, 2022 నాటికి 4,684 శాతానికి పెరిగిపోతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోంది. దీంతో వెనెజులా మరో జింబాబ్వేగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు. ఒక దశలో జింబాబ్వే ద్రవ్యోల్బణం 231,150,889 శాతాన్ని కూడా తాకింది.

భారత కంపెనీలపై ప్రభావం!
ఒకప్పటితో పోలిస్తే ఇరుగు పొరుగు దేశాలతో వెనెజులా వాణిజ్య సంబంధాలు ప్రస్తుతం చాలా పరిమిత స్థాయికి చేరాయి. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు అగ్రరాజ్యం అమెరికాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి. మన భారత ఫార్మా కంపెనీలైన డాక్టర్‌ రెడ్డీస్, గ్లెన్‌మార్క్‌ ఫార్మా వంటివి వెనెజులా మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటి వ్యాపారంపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

>
మరిన్ని వార్తలు