ఆర్థిక వ్యవస్థకు ‘చమురు’ సెగ!

21 Nov, 2017 23:55 IST|Sakshi

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారల్‌ ధర 63 డాలర్లు

జూన్‌ నుంచి 36శాతం అప్‌

భారత్‌కు తగిన స్థాయి 60 డాలర్లు

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు!

ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టుదాటలేదు. తగిన స్థాయిలోనే కరెంట్‌ అకౌంట్‌ లోటు. ఆర్థిక సంస్కరణల పరంపర. వెరసి తగిన వ్యాపార పరిస్థితులు ఉన్న దేశంగా భారత్‌ స్థానం ఒకేసారి 130 నుంచి 100కు జంప్‌. తాజాగా మూడీస్‌ రేటింగ్‌ పెంపు. ఇవన్నీ మనదేశం ముందున్న సానుకూల అంశాలు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 63 గరిష్ట స్థాయికి బలపడి, క్రూడ్‌ ధరలు 45 డాలర్ల కనిష్ట స్థాయిలో ఉండటం నాలుగు నెలలకు ముం దు కేంద్రానికి సంతోషాన్నిచ్చి ఉంటుంది.

కానీ, ఆ తర్వాత క్రూడ్‌ విషయంలో పరిస్థితి తల్లక్రిందులైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర భారీగా పెరిగిపోయింది. కొద్ది వారాల క్రితం 64.65 డాలర్ల స్థాయికి ఎగసి, ప్రస్తుతం 63 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇది 2015 నాటి గరిష్ట స్థాయి. ఇక డాలర్‌ మారకంలో రూపాయి విలువ సైతం గడిచిన నాలుగు నెలల్లో కొంత బలహీనపడి 65 డాలర్ల ఎగువకు చేరిపోయింది. ఇందుకు కారణాలు ఏమిటన్న అంశాన్ని పక్కడబెడితే, దేశీయంగా ఈ అంశం చూపే ప్రతికూల ప్రభావాలపై ఇప్పుడు ఆర్థిక విశ్లేషకుల్లో భారీ చర్చే మొదలైంది. ఈ సవాళ్లను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన 2018–2019 బడ్జెట్‌లో ఎలా ఎదుర్కొనగలరన్నది ప్రధానాంశం.

ఆందోళన ఎందుకు...
భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్‌ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది.
ఎఫ్‌ఐఐ, డీఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే ఆదాయం మధ్య నికర వ్యత్యాసమే కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌). చమురు దిగుమతుల బిల్లు 28 శాతం పెరగడం, ఎగుమతులు 1.1 శాతం పడిపోవడం వల్ల అక్టోబర్‌లో క్యాడ్‌ పెరుగడం తొలి హెచ్చరిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 1.5% ఉంటుందని (40 బిలియన్‌ డాలర్లు) ఒక అంచనా. అయితే చమురు ధరలు ఇదే రీతిన పెరుగుతుంటే... క్యాడ్‌ మరింత ఆందోళనకర స్థాయికి చేరే వీలుంది. క్యాడ్‌ పెరిగితే రూపాయి విలువ సైతం మరింత బలహీనపడుతుంది. దిగుమతుల బిల్లును పెంచే అంశమిది.
 రెండవ అంశానికొస్తే, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల దేశంలోనూ ధరల పెరుగుదలకు దారితీసే మరో ప్రధాన అంశం. ఇది సామాన్యునిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశాల్లో ఒకటి.
 ఇక ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలతో ఇప్పటికే ఆర్‌బీఐ తాను బ్యాంకులకు ఇచ్చే రుణ రేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం) తగ్గింపునకు మొగ్గుచూపడం లేదు.  4 శాతం వద్ద ద్రవ్యోల్బణాన్ని నిర్వహించలేని పక్షంలో రెపో రేటు తగ్గింపు నిర్ణయాన్ని పూర్తిగా ఆర్‌బీఐ పక్కనబెట్టే అవకాశం ఉంది. రెపో తగ్గింపుద్వారా డిమాండ్‌ పెరుగుతుందని, ఆర్‌బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న కార్పొరేట్లకు ఇది చేదువార్తే.
 ధరల కట్టడి కోసమని పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించాల్సిన పరిస్థితి కేంద్రానికి ఉత్పన్నమవుతోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయాలు పడిపోతాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటుకు ఇది ప్రతికూలాంశం. ఇది విధాన నిర్ణేతలకు కఠిన పరీక్షే. అక్టోబర్‌ 3న ప్రభుత్వం ఈ తరహాలోనే పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2 శాతం. దీనర్థం జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతం దాటకూడదన్నమాట (గత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 3.5%). వచ్చే ఆర్థిక సంవత్సరం దీనిని 3%కి తగ్గించాన్నది ప్రణాళిక.


బడ్జెట్‌లో గణాంకాలు.. సవాళ్లు..!
2018 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో జైట్లీ, ఆయన టీమ్‌ సమతౌల్యం పాటించాల్సిన అంశాలు, సవాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే...
 ప్రస్తుతం బ్రెంట్‌ 63 డాలర్ల స్థాయిలో ట్రేడవుతుండగా, భారత్‌కు తగిన శ్రేణి 56–60 డాలర్లు.
 ఇటీవల రేటు హేతుబద్ధీకరణ తరువాత, జీఎస్‌టీ ఆదాయంలో నష్టం రూ.20,000 కోట్లు.
 ప్రభుత్వ  బ్యాంకులకు రెండేళ్లలో రీ–క్యాపిటలైజేషన్‌కు అవసరమైన నిధులు రూ.2.1 లక్షల కోట్లు.
2017–18 ఆర్థిక సంవత్సరంలో స్ధూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనా శ్రేణి 6.75 – 7.5 శాతం కాగా, మొదటి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతంగా నమోదు.
2017–18లో డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ.72,500 కోట్లు. ఇప్పటి వరకూ వచ్చింది 52,500 కోట్లు.
ఆర్థిక వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఇంకా మందగమనంలోనే. కార్పొరేట్లకు పెరగని ఆదాయాలు.

మరిన్ని వార్తలు