క్రెడిట్‌ రిపోర్టులో తప్పులున్నాయా?

26 Feb, 2018 01:22 IST|Sakshi

వాటివల్ల కొత్త రుణాలు రాకపోవచ్చు

వడ్డీ రేట్లు కూడా  ఎక్కువగా ఉండే అవకాశం

వీటిని సరిచేసుకునే అవకాశం ఉండనే ఉంది

బ్యాంకులకు చెప్పటం ద్వారా ఉచితంగానే చేయొచ్చు

క్రెడిట్‌ బ్యూరో నిపుణుల సలహాలు, సూచనలివీ...  

రుణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు క్రెడిట్‌ స్కోరు పాత్రే కీలకం. బ్యాంకులు రుణ అభ్యర్థనలను ఆమోదించే ముందు దరఖాస్తుదారులకు సంబంధించి క్రెడిట్‌ బ్యూరో సంస్థలందించే స్కోరును చూస్తాయి. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకు వడ్డీ రేట్లలోనూ హెచ్చు, తగ్గులుంటాయి. అందుకే రుణానికి కీలకమైన క్రెడిట్‌ రిపోర్టులో తప్పులున్నా ఆ ప్రభావం   దరఖాస్తుదారులపై పడుతుంది. ఈ నేపథ్యంలో వాటికి పరిష్కారాలను తెలియజేసే కథనమే ఇది.


రిపోర్టులో ఏముంటుంది?
రుణ గ్రహీతలకు సంబంధించి స్కోరు ఎంతుందన్నది క్రెడిట్‌ రిపోర్టులో ఉంటుంది. 300 నుంచి 900 మధ్య ఈ స్కోరు ఉండొచ్చు.
వ్యక్తి పేరు, జండర్, గుర్తింపు వివరాలు (పాన్, వోటర్‌ ఐడీ, ఆధార్‌), చిరునామా, ఫోన్‌ నంబర్, సంబంధిత వ్యక్తి వృత్తి లేదా ఉద్యోగం తదితర సమాచారం రిపోర్ట్‌లో ఉంటుంది.
గతంలో తీసుకున్న రుణాలు, వాటికి సంబంధించి ఏవైనా బకాయిలుంటే ఆ సమాచారం, అలాగే విడిగా తీసుకున్నారా లేక భాగస్వామ్యంతో తీసుకున్నారా లేక వేరెవరికైనా హామీదారుగా ఉన్నారా... వంటి వివరాలు సైతం క్రెడిట్‌ రిపోర్టులో ఉంటాయి.
బ్యాంకులకు ఇంత వరకు ఎన్ని సార్లు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు, తిరస్కరణకు గురయ్యాయా? మంజూరయ్యాయా? ఆ మొత్తం ఎంత... అనే సమాచారమూ ఉంటుంది.
సాధారణంగా ఓ రుణ గ్రహీతకు సంబంధించిన క్రెడిట్‌ రిపోర్టును బ్యాంకుల అభ్యర్థన మేరకు బ్యూరోలు జారీ చేస్తాయి. ప్రతి రుణ గ్రహీతకు సంబంధించి సమాచారం, వివరాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు క్రెడిట్‌ బ్యూరోలకు అందిస్తుంటాయి. రుణ దరఖాస్తులు వచ్చినప్పుడు ఆయా వ్యక్తుల తాజా క్రెడిట్‌ రిపోర్ట్‌ను బ్యూరోల నుంచి పొందుతుంటాయి.
♦  ఎవరికి వారు విడిగా తమ క్రెడిట్‌ రిపోర్ట్‌ను క్రెడిట్‌ బ్యూరోల నుంచి పొందే అవకాశం కూడా ఉంది. వారికి సంబంధించిన క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఏడాదిలో ఒకసారి ఉచితంగా పొందొచ్చని, అంతకన్నా ఎక్కువ సార్లయితే నామమాత్రపు ఫీజు చెల్లించాలని ట్రాన్స్‌ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హృషికేష్‌ మెహతా తెలియజేశారు.

సాధారణంగా జరిగే తప్పులు
క్రెడిట్‌ రిపోర్టులో తప్పులు దొర్లడం కొన్ని సందర్భాల్లో సాధారణంగానే జరుగుతుంది. వీటి కారణంగా ఒక్కోసారి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురికావచ్చు. లేదా అధిక వడ్డీ రేట్లకు దారితీయొచ్చని హృషికేష్‌ మెహతా పేర్కొన్నారు. ‘‘అంత మాత్రాన ఆందోళన అక్కర్లేదు. ఆ తప్పులను సులభంగానే సరిచేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి తప్పులను అకౌంట్‌ తాలూకు, వ్యక్తిగత సమాచారం తాలూకు అని రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది’’ అని ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ బ్యూరో ఎండీ వైశాలి కస్తూరి తెలిపారు.

అకౌంట్‌కు సంబంధించినవైతే ఆలస్యపు చెల్లింపులకు సంబంధించిన సమాచారం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చెల్లింపులు చేసినప్పటికీ బకాయి ఉన్నట్టు నివేదిక చూపిస్తుంటుంది. ఓ క్రెడిట్‌ కార్డు లేదా రుణ ఖాతా వివరాలను పొరపాటుగా మరో వ్యక్తి ఖాతాలో నమోదు చేయడం, ఓ రుణాన్ని తీర్చివేసినప్పటికీ అది ఇంకా ముగిసిపోలేదని చూపించడం వంటివి కూడా ఖాతాకు సంబంధించిన తప్పులు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన తప్పులు అంటే పేరు, చిరునామాలో తప్పిదాలు, పని చేస్తున్న సంస్థ వివరాలు.

వీటిని ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రెడిట్‌ రిపోర్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే ఆప్షన్‌ను ప్రతీ క్రెడిట్‌ బ్యూరో అందిస్తోందని, అయితే ఏ మార్పులైనా సంబంధింత బ్యాంకును సంప్రదించిన తర్వాతే సరిచేయడం జరుగుతుందని వైశాలి తెలిపారు. క్రెడిట్‌ రిపోర్టు సరిచేసుకోవాలంటే దరఖాస్తును రుణం పొందిన బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును క్రెడిట్‌ బ్యూరోల వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. క్రెడిట్‌ బ్యూరోల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.

జతగా ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు బ్యూరోలు ఆ సమాచారాన్ని బ్యాంకులకు పంపి స్పష్టత తీసుకుంటాయి. తర్వాత మార్పు చేస్తాయి. దాంతో తాజా వివరాలు క్రెడిట్‌ రిపోర్ట్‌లో ప్రతిఫలిస్తాయి. క్రెడిట్‌ సమాచార కంపెనీల చట్టం 2005 ప్రకారం దరఖాస్తు అందిన 30 రోజుల్లోపు క్రెడిట్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందని వైశాలి తెలిపారు.

మరిన్ని వార్తలు