ఆరోగ్యానికి ‘టాపప్‌’ బూస్ట్‌

18 Jun, 2018 02:09 IST|Sakshi

ప్రీమియం తక్కువే, కానీ కవరేజీ ఎక్కువ

బేసిక్‌ పాలసీని దాటి వచ్చే క్లెయిమ్స్‌కు రక్షణ

అదనపు ఫీచర్లతో సూపర్‌ టాపప్‌ పాలసీలు

ఏటేటా పెరిగిపోతున్న వైద్య ద్రవ్యోల్బణం

దీంతో ఏటా 15% వరకు ఖరీదవుతున్న చికిత్సలు

టాపప్‌ ప్లాన్లే ఈ ఖర్చులకు పరిష్కారం  

శ్రీనివాసరావు వయసు 50. ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేసి ఈ మధ్యనే వ్యక్తిగత కారణాల రీత్యా మానేశాడు. కంపెనీలో పనిచేసినంత కాలం కంపెనీ ఇచ్చిన ఆరోగ్య బీమా పాలసీ ఉండేది. కంపెనీది ఉంది కదా... అని సొంత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోలేదు. ఇప్పుడేమో కంపెనీలో మానేశాడు. సరే! ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటైనా ఉండాలి కదా అని ఆలోచించి... కొన్ని పాలసీలు చూశాడు. అన్నీ బావున్నాయి.

కానీ బీమా ప్రీమియం మాత్రం కాస్తంత ఎక్కువగానే ఉంది. అదేంటని సదరు బీమా సిబ్బందిని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘మీ వయసును బట్టి చూస్తే మీకు రిస్కు ఎక్కువ కదండీ! అందుకే ప్రీమియం ఎక్కువ. ఒకవేళ ఇంకో ఏడాది రెండేళ్లు పోయాక తీసుకుంటే ప్రీమియం మరింత పెరుగుతుంది’’ అని చెప్పారా సిబ్బంది. అప్పుడు తెలిసొచ్చింది శ్రీనివాసరావుకు!! చిన్న వయసు నుంచే ఆరోగ్య బీమా పాలసీని కొనసాగించటం ఎంత మంచిదో...! – సాక్షి, బిజినెస్‌ విభాగం


నిజమే! వైద్య బీమా పాలసీని చిన్న వయసులోనే తీసుకోవడం... అప్పటి నుంచి దాన్ని కొనసాగించటం ఆరోగ్యానికే కాదు. జేబుకు కూడా చాలా మంచిది. ఉద్యోగంలో చేరిన లేదా ఆర్జన మొదలైన వెంటనే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ ఎప్పుడో తీసుకుని ఉంటే అది నేటి వైద్య అవసరాలకు అనుగుణంగా సరిపోతుందా? లేదా అన్న సమీక్ష కూడా అవసరమే. దేశంలో కొన్నేళ్లుగా వైద్య ద్రవ్యోల్బణం ఏటా 10 శాతం మేర పెరుగుతూ పోతోంది.

2018లో ఇది 11.3 శాతం మేర ఉంటుందని అడ్వైజరీ సంస్థ విల్లిస్‌ టవర్‌ వాట్సన్‌ నివేదిక స్పష్టం చేసింది. ఇక బీమా సంస్థలయితే వైద్య ఖర్చులు ఏటేటా 15 శాతం మేర భారం అవుతాయని అంచనా వేస్తున్నాయి. కనుక ఓ కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10–15 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ అవసరం. ఒకవేళ తక్కువ మొత్తానికే పాలసీ తీసుకుని ఉంటే అటువంటి వారు చేయాల్సింది తక్షణం మరో పాలసీ తీసుకోవడం... లేదా టాపప్‌ వేసుకోవడం. మరో పాలసీ అంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కనుక టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ పాలసీని తక్కువ ప్రీమియానికే ప్రస్తుత పాలసీకి కొనసాగింపుగా తీసుకోవచ్చు.

టాపప్‌తో ఖర్చు తక్కువ...
టాపప్‌ పాలసీ తీసుకోవడం ద్వారా వైద్య బీమా కవరేజీ పెంచుకోవటమన్నది తక్కువ ఖర్చులో అయిపోయే వ్యవహారం. అపోలో మ్యునిక్,  ఐసీఐసీఐ లాంబార్డ్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్‌ అలియంజ్‌ తదితర సంస్థలు ఈ తరహా టాపప్‌ పాలసీలను అందిస్తున్నాయి.

35 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో హెల్త్‌ పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.8,500 నుంచి 13,500 వరకు అవుతుంది. భార్యా, భర్త, వారి ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. దీనికి అదనంగా టాపప్‌ పాలసీని రూ.10 లక్షల కవరేజీతో తీసుకుంటే  ప్రీమియం మరో రూ.4,300 –6,330 మేర చెల్లిస్తే చాలు.

కొన్ని పరిమితులున్నాయి...
టాపప్‌ పాలసీలకు కొన్ని పరిమితులుంటాయని తెలుసుకోవాలి. వీటిలో ముఖ్యమైనది ఆరంభ పరిమితి (త్రెషోల్డ్‌) లేదా మినహాయింపు (డిడక్టబుల్‌). ఉదాహరణకు బేసిక్‌ పాలసీ (మొదట తీసుకున్నది) రూ.3 లక్షలకు ఉందనుకోండి. దానికి అదనంగా రూ.10 లక్షలకు టాపప్‌ తీసుకున్నారనుకోండి.

అప్పుడు హెల్త్‌ క్లెయిమ్‌ రూ.3 లక్షలు దాటితేనే టాపప్‌ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వైద్య బిల్లు రూ.7 లక్షలు వచ్చిందనుకుందాం. అప్పుడు బేసిక్‌ పాలసీ రూ.3 లక్షలు చెల్లించగా, టాపప్‌ ప్లాన్‌ నుంచి రూ.4 లక్షల చెల్లింపు జరుగుతుంది. అలాగే, బేసిక్‌ పాలసీ రూ.5 లక్షలకు ఉండి, టాపప్‌ పాలసీ రూ.10 లక్షలకు తీసుకున్నారనుకోండి. అప్పుడు రూ.5 లక్షలు డిడక్టబుల్‌ అవుతుంది.

దీని ప్రకారం ఆస్పత్రిలో బిల్లు రూ.3 లక్షల చొప్పున ఒక ఏడాదిలో రెండు క్లెయిమ్‌లు వచ్చాయనుకోండి. సాధారణంగా బేసిక్‌ పాలసీ కవరేజీ రూ.5 లక్షల వరకే ఉంది కనుక రూ.లక్షను జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో బిల్లు రూ.3 లక్షలుగానే ఉంది. అది బేసిక్‌ లిమిట్‌ను దాటలేదు. ఒకే బిల్లు బేసిక్‌ కవరేజీని దాటి ఉంటేనే టాపప్‌ అక్కరకు వస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.  

సూపర్‌ టాపప్‌
టాపప్‌ పాలసీల్లో ఉన్న పరిమితులు ఇబ్బందిగా భావించే వారికి సూపర్‌ టాపప్‌ పాలసీలున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, అపోలో మ్యునిక్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ తదితర కంపెనీలు వీటిని ఆఫర్‌ చేస్తున్నాయి. ఉదాహరణకు మీకు బేసిక్‌ హెల్త్‌ పాలసీ రూ.3 లక్షలకు ఉండి  రూ.12 లక్షల కవరేజీని సూపప్‌ టాపప్‌గా తీసుకున్నారనుకుంటే... అప్పుడు రూ.3 లక్షలు డిడక్టబుల్‌ అవుతుంది. అంటే రూ.4 లక్షలు చొప్పున ఒకే ఏడాదిలో రెండు క్లెయిమ్స్‌ వచ్చాయనుకోండి.

అప్పుడు మొదటి క్లెయిమ్‌లో బేసిక్‌ పాలసీ నుంచి రూ.3 లక్షలు, టాపప్‌ నుంచి రూ.లక్ష పరిహారంగా అందుతుంది. రెండో క్లెయిమ్‌లో రూ.4 లక్షలు టాపప్‌ పాలసీ నుంచే చెల్లింపులు జరుగుతాయి. సూపర్‌ టాపప్‌ పాలసీలు రూ.15 లక్షలపైన కవరేజీలను కూడా అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నుంచి రూ.20 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్‌ టాపప్‌ తీసుకోవాలనుకుంటే ప్రీమియం రూ.3,850 మాత్రమే. ఇది 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కుటుంబానికి (దంపతులు, ఇద్దరు పిల్లలు) సంబంధించిన అంచనా.


చూడాల్సిన ఇతర అంశాలివీ...
నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందేటట్లయితే టాపప్‌ పాలసీల్లో నగదు రహిత చెల్లింపులు జరిగిపోతాయి.  
ముందుగా అనుకుని పొందే చికిత్స అయితే 48 గంటల ముందుగా బీమా కంపెనీకి తెలియజేస్తే సరిపోతుంది. లేదా అత్యవసరం అయి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన తర్వాత 24 గంటల్లోపు తెలియజేసి అప్రూవల్‌ తీసుకోవాలి.  
 రెండూ కాకపోతే చికిత్సకు సొంతగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్‌మెంట్‌ పొందొచ్చు.  
   రెగ్యులర్‌ పాలసీ అయితే ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం కనీస కాలం (వెయిటింగ్‌ పిరియడ్‌) వేచి ఉండాలి. అలాగే, కొన్ని వ్యాధులకు చికిత్సా మినహాయింపులు కూడా ఉంటాయి.  
   ప్రత్యేకంగా కొన్ని వ్యాధులకు కవరేజీ పరిమితులు కూడా ఉండొచ్చు.  
   రెగ్యులర్‌ పాలసీ, టాపప్‌ పాలసీని వేర్వేరు బీమా సంస్థల నుంచి తీసుకుని ఉంటే క్లెయిమ్‌ కోసం రెండు కంపెనీలకు సమాచారం తెలియజేయడం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఒకవేళ వేర్వేరు సంస్థల నుంచి తీసుకున్నప్పటికీ రెండింటితోనూ టైఅప్‌ ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు.  
 టాపప్‌ ప్లాన్లపై నో క్లెయిమ్‌ బోనస్‌ రాదు. వీటి లో ప్రవేశ వయసు గరిష్టంగా 65–80 వరకే. ఒకవేళ తల్లిదండ్రులు బేసిక్‌ ప్లాన్‌లో లేకపోతే, టాపప్‌ ప్లాన్లలో యాడ్‌ చేసుకోవచ్చు.  
 ఇక చివరి అంశం... రెగ్యులర్‌ పాలసీ లేకపోయినా కానీ టాపప్‌ ప్లాన్లను తీసుకునే సదుపాయం ఉంది. 

మరిన్ని వార్తలు