ఇన్ఫీ నిర్ణయంతో భారత్ లో ఉద్యోగాలు ఔట్

5 May, 2017 18:43 IST|Sakshi
ఇన్ఫీ నిర్ణయంతో భారత్ లో ఉద్యోగాలు ఔట్
బెంగళూరు : భారత్ టెక్కీలకు షాకిస్తూ.. అమెరికాలో భారీ ఉద్యోగాల నియామకానికి రంగం సిద్ధంచేస్తున్నట్టు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం టెక్కీల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఇన్ఫీ కంపెనీల్లో 10వేల మంది అమెరికన్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత్ లో భారీగా ఉద్యోగాలు కోత ఉండబోతున్నట్టు రిక్రూట్ మెంట్ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

అమెరికాలో స్థానిక రిక్రూట్ మెంట్ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. లక్ష్మీకాంత్ తెలిపారు. దీంతో భారత్ లో ఆఫ్ సోర్ ఉద్యోగాల కోత భారీగా ఉంటుందని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠితనరమైన నిబంధనలే ఈ మేరకు భారత ఐటీ ఇండస్ట్రీని దెబ్బకొడుతున్నాయని తెలిసింది. ఇన్ఫోసిస్ 500 అమెరికన్ టెక్కీలను నియమించుకుంటే, ఇండియాలో ఆఫ్ సోర్స్ ఆపరేషన్స్ కు చెందిన 2000 ఉద్యోగాలు పోతాయని లక్ష్మీకాంత్ తెలిపారు. 
 
ఆటోమేషన్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ అదనంగా మరో 30-40% శాతం  నియామకాల్ని తగ్గిస్తాయని చెప్పారు.ఇలా భారీ మొత్తంలోనే ఉద్యోగాలు కోల్పోనున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ ఐటీ సంస్థలు హెచ్-1బీ వీసాలపై ఉద్యోగాలు చేసే టెక్కీలకు ఏడాదికి 60వేల డాలర్ల నుంచి 65వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో వీరు ఆన్ సైట్ వర్క్ నుంచి రిటర్న్ రావాల్సి  ఉంటుందని తెలిసింది. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహింద్రా, కాగ్నిజెంట్, క్యాప్ జెమ్మీ, మైక్రోసాప్ట్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో ప్రకటనలు చేస్తే భారత రిక్రూట్ మెంట్ పై భారీ ప్రభావమే ఉండనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగాల ప్రకటన చేసిన అనంతరమే హెచ్-1బీ వీసా ప్రక్రియలో దుర్వినియోగాన్ని సహించేది లేదంటూ అసిస్టెంట్ అటార్ని జనరల్ ఆఫ్ సివిల్ రైట్స్ డివిజన్ టామ్ వీలర్స్ మరో సారి భారత  ఐటీ సంస్థలను హెచ్చరించారు. 
 
మరిన్ని వార్తలు