ఇన్ఫోసిస్‌ సీఈఓ వేతనం రూ. 34.27 కోట్లు 

3 Jun, 2020 04:23 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది (2019–20)లో ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సలీల్‌ పరేఖ్‌ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్‌ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. అంతక్రితం ఏడాది (2018–19)లో రూ. 24.67 కోట్లు చెల్లించగా.. ఈ మొత్తంతో పోల్చితే గతేడాది చెల్లింపులు 39% పెరిగాయి. సంస్థ చైర్మన్‌ నందన్‌ నీలేకని తనకు ఎటువంటి పారితోషికం వద్దని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) యూబీ ప్రవీణ్‌ రావు వేతనం 17.1% పెరిగి రూ. 10.6 కోట్లకు చేరింది. ఇక గతేడాదిలో టీసీఎస్‌ సీఈఓ, ఎండీ రాజేష్‌ గోపీనాథన్‌ వేతనం 16% తగ్గింది. ఈయనకు రూ. 13.3 కోట్లు చెల్లించినట్లు టీసీఎస్‌ ప్రకటించింది. మరోవైపు, విప్రో సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా పారితోషికం 11.8% పెరిగింది. గతేడాదిలో ఈ తీసుకున్న మొత్తం రూ. 33.38 కోట్లుగా వెల్లడైంది.

పనిలో వేగం పెరిగింది: సలీల్‌ 
అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో గ్లోబల్‌ టెలికమ్యూనికేషన్స్, హై టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ వంటి పలు పరిశ్రమల్లో వేగం పెరిగిందని సలీల్‌ పరేఖ్‌ అన్నారు. క్లైయింట్ల అవసరాలపైన దృష్టిసారించడం ద్వారా ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు