మూర్తి కనిపించకపోవడం ఆశ్చర్యం

24 Jun, 2017 20:31 IST|Sakshi
మూర్తి కనిపించకపోవడం ఆశ్చర్యం
కంపెనీ వ్యవస్థాపకులకు, మేనేజ్ మెంట్ కు ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫోసిస్ ఓ వైపు నుంచి అన్ని క్లారిటీలు ఇచ్చేస్తోంది. కానీ తొలిసారి ఇన్ఫోసిస్ సహా-వ్యవస్థాపకులు నేడు జరిగిన అత్యంత కీలకమైన భేటీకి హాజరుకాలేదు. కంపెనీ నేడు(శనివారం) బెంగళూరులో 36వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించింది. కానీ ఈ సమావేశంలో వ్యవస్థాపకులు లేదా ప్రమోటర్లు ఎక్కడా కనిపించలేదు. గత ఏజీఎంకు నారాయణమూర్తి తన కొడుకు రోహన్ మూర్తితో కలిసి హాజరయ్యారు. మూర్తి రాకపోవడం, సహా వ్యవస్థాపకులు కనిపించకపోవడం చాలా మంది ఇన్వెస్టర్లకు ఆశ్చర్యకరంగా తోచింది. అయితే సహవ్యవస్థాపకులు ఈ భేటీకి ఎందుకు రాలేదని అడుగగా, తమకు తెలియదని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం.  
 
మూర్తితో పాటు నందన్ నిలేకని, ఎస్.గోపాల్ క్రిష్ణన్, ఎస్డీ శిబులాల్, ఎన్ఎస్ రాఘవన్, కే దినేష్, అశోక్ అరోరాలు ఈ కంపెనీకి సహవ్యవస్థాపకులు. 1981లో వీరు ఈ సంస్థను స్థాపించి, అనంతరం 1993లో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అనంతరం ఇది భారత టెక్ పరిశ్రమలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. నేడు జరిగిన ఏజీఎంకు ఇన్వెస్టర్లు తమ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ సిటీలోని క్యాంపస్ కు 20 కిలోమీటర్ల దూరంలో గల క్రీస్తు కళాశాల ఆడిటోరియంలో దీన్ని ఏర్పాటుచేశారు. ఎప్పుడూ తొలి వరుసలో ఆసనమయ్యే  మూర్తి  కనిపించకపోవడంతో తాము కొంత ఆశ్చర్యానికి గురయ్యామని  ఇన్వెస్టర్ రమణా రెడ్డి చెప్పారు. 
 
మాజీ డైరెక్టర్లు టీవీ మోహన్ దాస్ పాయ్, వీ బాలక్రిషన్ కూడా ఈ మీటింగ్ కు హాజరుకాలేదన్నారు. బోర్డు చైర్మన్ శేషసాయి, కోచైర్మన్ రవి వెంకటేషన్, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు, స్వతంత్ర డైరెక్టర్లు కిరణ్‌ మజుందర్ షా, డీఎన్ ప్రహ్లాద్, పునిత్ కుమార్-సిన్హా, జాన్ డబ్ల్యూ ఎట్చెమెండి, రూపా కుద్వాలు వేదికను అలంకరించారు. శేషసాయి ప్రసంగం అనంతరం మిగతా వారు కంపెనీ ఆర్థిక పనితీరు గురించి ఇన్వెస్టర్లకు వివరించారు. 
మరిన్ని వార్తలు