సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్‌

1 Jun, 2020 15:17 IST|Sakshi

సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం దిశగా పయనిస్తోంది. కరోనా సంక్షోభంలో సంభవించిన వ్యాపార నష్టాలు, ఖర్చులు తగ్గించుకునే  క్రమంలో సంస్థ పరిమాణాన్ని కుదించుకోవాలని చూస్తోంది.  అలాగే వేగంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యాలపై దృష్టి పెడుతోంది. సీనియర్‌  ఎగ్జిక్యూటివ్‌ల పలు స్థాయిల్లో కొన్ని పోస్టులను తగ్గించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ పునర్నిర్మాణం ద్వారా  ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని సంస్థ భావిస్తోంది.

ఎకనామిక్ టైమ్స్ అందించిన నివేదిక ప్రకారం, ఇన్ఫోసిస్  సీనియర్‌  ( జెఎల్ 7 అంతకంటే ఎక్కువ) స్థాయిల్లో,  డెలివరీ మేనేజర్లు, ఏవీపీలు, వీపీలు, ఎస్‌వీపీల ర్యాంకుల్లో   పోస్టులను క్రమ క్రమంగా తగ్గించాలని భావిస్తోంది. 10-15 శాతం  కుదింపునకు సంబంధించిన ఈ నిర్ణయం  సుమారు 1,300 మంది అధికారులను ప్రభావితం చేస్తుందని అంచనా. సీనియర్‌ స్థాయిలో  30వేలకు పైగా ఉద్యోగులుండగా  జేఎల్‌  6,7, 8 స్థాయిల్లో 13వందల మంది ఉద్యోగులు ఉన్నారు. (వేతనపెంపు, ప్రమోషన్లు లేనట్టే..)

సీఈఓ సలీల్ పరేఖ్ ఆధ్వర్యంలో ప్రతి స్థాయిలోనూ సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఇన్ఫోసిస్ ఐదంచెల నిర్మాణాన్ని రెండుగా విడగొట్టాలని, పీపుల్ మేనేజర్లుగా ఉన్న సీనియర్ అధికారుల్లో ఎక్కువ బాధ్యత , జవాబుదారీ తనాన్ని తీసుకురావాలని  నిర్ణయించింది.  ఈ పునర్నిర్మాణ  కార్యక్రమం అమ్మకాలు, డెలివరీ, బీపీవో, ఇతర రంగాలపై ప్రభావం చూపుతుందని కంపెనీ తెలిపింది.

కోవిడ్ -19 మహమ్మారి, ఆర్థిక మాంద్యం ఫలితంగా కొన్ని కఠిన నిబంధనలు అమలుకు ఖాతాదారులు డిమాండ్‌ చేస్తున్నారనీ, మరికొందరు కొనసాగుతున్న కొన్ని ప్రాజెక్టులను  వాయిదా, లేదా రద్దు చేసినట్టు వెల్లడించింది. దీంతో డిమాండ్ తగ్గిందని ఇన్ఫోసిస్ తన వార్షిక నివేదికలో తెలిపింది.మేనేజర్ల స్థాయి సీనియర్ల జీతాలు రూ. 35-40లక్షలపరిధిలోనూ, వైస్‌ ప్రెసిడెంట్లు, ఎస్‌వీపీలు, ఇతర సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు   భారీ వేతనాలను కంపెనీ చెల్లిస్తోంది. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన)

మరోవైపు ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే, పనితీరు ఆధారంగా ఉద్యోగుల తీసివేత నిర్ణయం తీసుకునే సంస్థలో ప్రతి సంవత్సరం లాగానే కొన్ని చర్యలుంటాయని చెప్పారు.

మరిన్ని వార్తలు