స్నేహితురాలిని పెళ్లాడిన రోహన్‌ మూర్తి!

5 Dec, 2019 14:55 IST|Sakshi

నిరాడంబరంగా ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కుమారుడి వివాహం

బెంగుళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సుధామూర్తిల ఏకైక కుమారుడు రోహన్ మూర్తి(36) తన చిరకాల స్నేహితురాలైన అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా కొద్దిమంది బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం సోమవారం బెంగుళూరులో వివాహం జరుగగా.. వివాహ రిసెప్షన్ అదే రోజు సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, బోర్డు డైరెక్టర్లు, ఐటి సహా వివిధ రంగాలలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. రిసెప్షన్‌లో రోహన్ కుర్తా, బ్లాక్ ప్యాంట్ ధరించగా, అపర్ణ లెహంగాలో మెరిశారు. 

ఇన్ఫోసిస్ చైర్మన్‌ నందన్‌ నీలేకనితో పాటు ఇండిపెండెంట్‌ డైరెక్టర్, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, భారత బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకొనే, రోహన్ చెల్లెలు అక్షతామూర్తి రిసెప్షన్‌లో పాల్గొన్నారు. 

మూడు సంవత్సరాల క్రితం ఒక కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా కలిసిన రోహన్, అపర్ణ.. ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారి వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్‌ పట్టా పొందిన రోహన్ 2011లో టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ జంట 2015లో విడాకులు తీసుకున్నారు. ఇక గోల్డ్‌మన్ సాచ్స్, మెకిన్సే వంటి గ్లోబల్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలలో పనిచేసిన అపర్ణ, 2014 నుంచి రోహన్ స్థాపించిన సోరోకోలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా