దేశీయ టెక్ దిగ్గజాలకు రూపీ షాక్

15 May, 2017 10:40 IST|Sakshi
దేశీయ టెక్ దిగ్గజాలకు రూపీ షాక్
దేశీయ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీలకు ఇన్ని రోజులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకివ్వగా.. ఇప్పుడు మరో కొత్త ప్రాబ్లమ్ వచ్చి పడింది. ఆశ్చర్యకరంగా రూపీ విలువ పునరుద్ధరించుకోవడం ప్రారంభించింది. రూపీ విలువ పునరుద్ధరణ  ఒకవిధంగా ఎక్స్ పోర్ట్స్ లో అగ్రగామిగా ఉన్న సాప్ట్ వేర్ సర్వీసుల రంగానికి భారీ షాకేనని విశ్లేషకులు చెబుతున్నారు.

డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 5.6 శాతం జంప్ అయింది. ఇది ద్రవ్యోల్బణం దిగిరావడానికి సహకరిస్తోంది. కానీ ఎక్స్ పోర్టు సర్వీసు కంపెనీల ఆదాయాలకు ఛాలెంజింగ్ గా మారిందన్నారు. ఒక్క టెక్నాలజీ కంపెనీలకే కాక, డ్రగ్ కంపెనీలకు భారీగానే దెబ్బతీస్తుందట. ఇటీవలే టెక్, ఫార్మా దిగ్గజాలు హెచ్-1బీ వీసా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ దాడులతో సతమతమవుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇది మరో సమస్యలా వాటికి పరిణమిస్తోంది.  
 
ఐటీ ఎక్స్ పోర్ట్ దిగ్గజాలు టాటా, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు 90 శాతం రెవెన్యూలను విదేశాల నుంచే ఆర్జిస్తున్నాయి. వాటితో పాటు డ్రగ్ మేకర్స్ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుపిన్ లిమిటెడ్ ల  ఆదాయాలు 70 శాతానికి పైగా విదేశాలవే. ఒక్కసారిగా రూపాయి విలువ పెరగడం ఈ కంపెనీలకు ఆందోళనకరంగా మారిందని రిలయన్స్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ రాకేష్ థార్వే చెప్పారు. రూపాయి విలువ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు.

అయితే  ఈ క్వార్టర్ వరకు వెల్లడించిన కంపెనీ ఆదాయాలపై రూపాయి విలువ పెంపు ప్రభావం చూపిందని తాము భావించడం లేదని రాకేశ్ చెప్పారు. కానీ రూపాయి విలువ 1 శాతం పెరుగతున్న ప్రతిసారి, ఐటీ ఎక్స్ పోర్టు కంపెనీల మార్జిన్లు 25-30 బేసిస్ పాయింట్లు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. వచ్చే క్వార్టర్లో ఫార్మా కంపెనీల ఆదాయాలు 4 శాతం నుంచి 6 శాతం, సాప్ట్ వేర్ సంస్థల ఆదాయాలు 2 శాతం నుంచి 3 శాతం పడిపోతాయని ముంబాయికి చెందిన టీసీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రీ లోకప్రియ చెప్పారు.  
మరిన్ని వార్తలు