మౌలిక రంగం మెరుపులు 

1 Aug, 2018 00:31 IST|Sakshi

జూన్‌లో 6.7 శాతంగా నమోదు 

గడిచిన ఏడు నెలల్లో  ఎన్నడూ లేనంత వృద్ధి రేటు      

న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం గ్రూప్‌– జూన్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. గ్రూప్‌ ఉత్పత్తి వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడు నెలల్లో ఎన్నడూ ఇంత స్థాయి వృద్ధి నమోదుకాలేదు. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్, విద్యుత్‌ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. గత ఏడాది జూన్‌లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు ఒక శాతంకాగా, ఈ ఏడాది మేలో వృద్ధి రేటు 4.3 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 40.27 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది రంగాల జూన్‌ ఫలితాలను మంగళవారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే... 

వృద్ధిలో ఆరు రంగాలు
బొగ్గు: వృద్ధి రేటు 11.5 శాతంగా నమోదయ్యింది. 2017 జూన్‌ నెలలో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –6.7 శాతం క్షీణత నమోదయ్యింది.  
రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి 12 శాతంగా నమోదయ్యింది. బొగ్గు రంగం తరహాలోనే 2017 జూన్‌లో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణత నమోదయ్యింది.  
సిమెంట్‌: –3.3 క్షీణత 13.2 శాతం వృద్ధికి మళ్లింది.  
ఎరువులు: ఈ రంగం కూడా –2.7 శాతం క్షీణత నుంచి 1 శాతం వృద్ధికి మారింది.  
స్టీల్‌: వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 6 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది.  
విద్యుత్‌: ఈ రంగం ఉత్పాదకత వృద్ధి 2.2 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది.  
క్షీణతలో 2 రంగాలు...
క్రూడ్‌ ఆయిల్‌: ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –3.4 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది జూన్‌లో ఈ రంగం వృద్ధి రేటు 0.6 శాతం.  
సహజ వాయువు: ఈ రంగంలో కూడా 6.4 శాతం వృద్ధి రేటు –2.7 శాతం క్షీణతకు మళ్లింది.  
ఏప్రిల్‌–జూన్‌ కాలంలో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌ వృద్ధిరేటు 2.5 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది.    

>
మరిన్ని వార్తలు