బీమా పాలసీలు ప్రత్యేకం..

30 Mar, 2014 02:48 IST|Sakshi

కోటికి వైద్య బీమా
 సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రో హెల్త్’ పేరుతో కొత్త వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీలోని ప్రత్యేకత. ప్రొటెక్ట్, ప్లస్, ప్రిఫర్డ్, ప్రీమియర్ పేరుతో ఈ పాలసీ నాలుగు రకాల ఆప్షన్లు అందిస్తోంది. ప్రీమియం భారం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అవకాశాన్ని కల్పిస్తోంది. అదే 65 ఏళ్లు దాటిన వారికి కో-పేమెంట్ తప్పనిసరి.
 
 మ్యాక్స్ లైఫ్ శిక్షా సూపర్ ప్లస్
 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ పిల్లల ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా ‘శిక్షా ప్లస్ సూపర్’ పేరుతో యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల ఉన్నత చదువులకు అక్కరకు వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఈ పథకం గ్యారంటీ లాయల్టీ అడిషన్‌తో పాటు అవసరమైతే 5 ఏళ్ల తర్వాత నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. తల్లిదండ్రులకు ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ మొత్తం చెల్లించడంతోపాటు, పిల్లల భవిష్యత్తు ఫీజులను కూడా బీమా కంపెనీయే భరిస్తుంది.
 
 కొటక్ ‘జిఫి’ అకౌంట్
 కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి’ పేరుతో సోషల్ నెట్‌వర్క్ బ్యాంక్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ అకౌంట్‌ను రూ.5,000తో ప్రారంభించొచ్చు. కనీస నిల్వ అవసరం లేదు. సేవింగ్స్ ఖాతాపై ఎటువంటి వడ్డీ ఉండదు. అకౌంట్‌లో ఉన్న నగదు రూ.25,000 దాటితే అది ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా మారిపోతుంది.

మరిన్ని వార్తలు