ఆరోగ్య బీమా సమాచారానికి ఐఆర్‌డీఏ పోర్టల్

7 Dec, 2015 04:26 IST|Sakshi

ముంబై: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ) తాజాగా ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోటున అందించాలనే లక్ష్యంతో ‘రిజిస్ట్రీ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇన్సూరర్స్ (రోహిణి)’ పేరుతో ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఐఆర్‌డీఏ చైర్మన్ టీ ఎస్  విజయన్ ఈ రోహిణి పోర్టల్‌ను సోమవారం ముంబైలో ఆవిష్కరించనున్నారు. ఈ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) ద్వారా నమోదైన దాదాపు 35,000 హాస్పిటళ్లలోని ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ, ట్రీట్‌మెంట్‌కు అయ్యే వ్యయం, క్లెయిమ్ ఖర్చులు తదితర సమాచారం అందుబాటులో ఉంటుందని ఐఆర్‌డీఏ సభ్యులు నిలేశ్ సతే తెలిపారు. తమ ప్రయత్నం బీమా కంపెనీలు, హాస్పిటళ్లకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

ఐఆర్‌డీఏ నుంచి ప్రత్యేక గుర్తింపు నంబర్‌ను పొందడం వల్ల  దేశంలోని ప్రతి హాస్పిటల్ క్యాష్‌లెస్ పేమెంట్ కోసం బీమా కంపెనీతో అనుసంధాన మవుతున్నాయి. దీంతో ఐఐబీ అన్ని హాస్పిటళ్లకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌తో సహా తదితర విధానాలను పర్యవేక్షించగలదు. హెల్త్ ప్రొవైడర్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్‌ను ఇవ్వడం ఆహ్వానించదగినదని, దీంతో ఇన్సూరర్స్‌కు ఉపయుక్తంగా ఉంటుందని ఐసీఐసీఐ లంబార్డ్ క్లెయిమ్స్, రిఇన్సూరెన్స్ చీఫ్-అండర్‌రైటింగ్  సంజయ్ దత్తా తెలిపారు.

మరిన్ని వార్తలు