బీమా..ఎంపిక ఇలా!

17 Aug, 2015 00:37 IST|Sakshi
బీమా..ఎంపిక ఇలా!

ఊహించని పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ధీమాను కల్పించేది బీమా. అయితే పాలసీ తీసుకున్న వారిలోనూ చాలా మంది.. ఏదో ఒక పాలసీ ఉంటే చాలు అనుకునే వారే ఉంటున్నారు తప్ప.. ఇది తప్పనిసరి అవసరంగా భావించి తీసుకునే వారి సంఖ్య తక్కువ. బీమాపై ఇంకా ప్రజల్లో పూర్తిగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. కొన్ని విషయాలపై కసరత్తు చేస్తే మనకు, మన కుటుంబానికి అవసరమైన కవరేజీని చౌకగా అందించే.. అనువైన బీమా పథకాన్ని ఎంచుకోవడం సులభతరం అవుతుంది. అలాంటి అంశాల గురించి వివరించేదే ఈ కథనం.
 
1. రిస్కు బేరీజు: ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్న పక్షంలో ముందుగా మనం ఆరోగ్యపరంగా గతంలో ఎదుర్కొన్న సమస్యలు, భవిష్యత్‌లో తలెత్తే అవ కాశం ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా మనకు రిస్కు ఎంత మేర ఉందన్న దానిపై ఒక అంచనాకు రావొచ్చు. సాధారణంగా పాలసీల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటుంటాయి. ఒకవేళ సరైనది ఎంచుకోకపోతే మనకు కావల్సిన దానికి కవరేజీ లేకుండా పోతుంది. ఫలితంగా కట్టిన ప్రీమియం అంతా వ్యర్థమవుతుంది. గృహ బీమాకు కూడా ఇది వర్తిస్తుంది. స్థానికంగా నేరాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి వల్ల గృహానికి ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్నది బేరీజు వేసుకోవాలి. ఇంటిలోని వస్తువుల విలువను లెక్కగ ట్టి .. తగిన  స్థాయిలో కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవాలి. ఇక వాహన బీమా విషయానికొస్తే.. బీమా అవసరాలపై తగిన దృష్టి పెట్ట్లాలి.    
 
2. ‘చౌక’ అన్ని వేళలా సరికాదు!
బీమా కవరేజీ  చాలా కీలకమైనది. చౌకగా వస్తోంది కదా అని ఏ పాలసీబడితే అది తీసుకోకూడదు. పాలసీకి కట్టాల్సిన ప్రీమియం కన్నా దాని ద్వారా వచ్చే కవరేజీకి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వైద్యం, పిల్లల విద్యాభ్యాసం మొదలైన వాటన్నింటికీ ఎలాంటి అవాంతరం లేకుండా చూసుకోవడానికి వీలవుతుంది. గృహ బీమాకు సంబంధించి తక్కువ కవరేజీ తీసుకున్న పక్షంలో ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగితే అరకొర క్లెయిమ్ మొత్తాల వల్ల ఒరిగే ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి. ఇంటిని మళ్లీ రిపేరు చేయాలన్నా, తిరిగి కట్టుకోవాల్సి వచ్చినా, ఇంట్లో వస్తువులను తిరిగి కొనుక్కోవాల్సి వచ్చినా.. తగినంత విలువకు కవరేజీ తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. వాహన బీమాకు సంబంధించి కూడా కవరేజ్ అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
 
3.ఏటా కవరేజీ సమీక్షించుకోవాలి: మన రిస్కులను ప్రతి ఏడాదీ సమీక్షించుకుంటూ ఉండాలి. ఎంచుకున్న కవరేజీ దానికి తగ్గట్లుగానే ఉందా లేదా అన్నది చూసుకోవాలి.
 
4. పేరొందిన బీమా సంస్థనే ఎంచుకోవాలి: వీలైనంత వరకూ పేరొందిన బీమా సంస్థ పాలసీలనే ఎంచుకోవడం మంచిది. క్లెయిమ్‌ల పరిష్కారంలో పాలసీదారుల నమ్మకాన్ని కష్టపడి సాధించుకున్న టాప్ రేటింగ్ కంపెనీలు సాధ్యమైనంతవరకూ విశ్వసనీయమైన ఆఫర్లనే అందిస్తుంటాయి.
 
5. మినహాయింపులు చూసుకోవాలి:
పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోవాలి. సందేహాలొస్తే మొహమాటపడకుండా ఏజెంటును ప్రశ్నించి తెలుసుకోవాలి. ఒకవేళ పాలసీలో ఏదైనా సందర్భానికి మినహాయింపు ఉన్న పక్షంలో... యాడ్ ఆన్ ఆప్షన్స్ లాంటివి ఉన్నాయేమో కనుక్కోవాలి.

మరిన్ని వార్తలు