ఈఎంఐలు ఎక్కువైనా చిక్కులే

29 May, 2017 00:47 IST|Sakshi
ఈఎంఐలు ఎక్కువైనా చిక్కులే

ఇంటి రుణం, వ్యక్తిగత రుణం, బీమా పాలసీలు...  
వేతనంలో పరిమితంగానే నెలసరి చెల్లింపులు


రుణాలు కావచ్చు... ఇన్వెస్ట్‌మెంట్లు కావచ్చు... ఖర్చులు కావచ్చు! కానీ వాటి కోసం చేసే చెల్లింపులు పరిమితి దాటితే కోరి చిక్కులు తెచ్చుకున్నట్టే.! రాబడులు తక్కువగా ఉండే సంప్రదాయ బీమా పాలసీలు, అధిక వడ్డీతో కూడిన వ్యక్తిగత రుణాలు ఆర్థిక లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. ఇంటి రుణం కూడా... ఆర్థికంగా ప్రయోజనం కల్పించేది అయి ఉండాలి గానీ, భారంగా పరిణమించకూడదు. అందుకే వచ్చే ఆదాయంలో వీటికంటూ ఓ నిర్ణీత పరిమితి విధించుకోవడం అవసరం.

శేఖర్‌ ఈ మధ్యే గృహ రుణం తీసుకుని ఫ్లాట్‌ కొన్నాడు. అప్పటికే తనకు వ్యక్తిగత రుణం బకాయిలున్నాయి. ఇక గృహ ప్రవేశం ఖర్చులకు స్నేహితులనడిగి కొంత మొత్తం తీసుకున్నాడు. ఇక కార్‌ లోన్‌ ఇంకా ఏడాది చెల్లించాల్సి ఉంది. జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులతో కలిసి తడిసి మోపెడవుతోంది. వీటికోసం నెలనెలా క్రెడిట్‌ కార్డులపై వాడకం పెంచాడు. దాంతో అవి కూడా భారీగా బిల్లులొస్తున్నాయి. కనీస బిల్లు చెల్లిస్తుండటంతో వడ్డీ భారీగా పెరుగుతోంది. శేఖర్‌ ప్లానింగ్‌ మంచిదే. కానీ ఇబ్బందులు మామూలుగా లేవు. ఎందుకిలా? ఇదే విషయం చెప్పి తన మిత్రుడైన ఫైనాన్షియల్‌ ప్లానర్‌ దగ్గర వాపోయాడు శేఖర్‌. దానికి ఆ అడ్వయిజర్‌... తన క్లయింట్లు కొందరి అనుభవాలు చెబుతూ తగిన సూచనలిచ్చారు. ఆ వివరాలే ఇవి...

ఇంటి రుణం...
ఇంటి తాలూకూ వ్యయాలు... రుణానికి చెల్లించే ఈఎంఐ కావచ్చు లేదా ఇంటి అద్దె కావచ్చు. ఏదైనా గానీ వేతనంలో చెప్పుకోతగ్గ వ్యయం అవుతుంది. గృహ రుణ ఈఎంఐ వేతనంలో 35–40 శాతానికే పరిమితం చేయాలి. పన్ను ఆదా, పొదుపు కోసమే రుణంపై ఇంటిని కొనుగోలు చేసినా  సరే... ఇది నిర్ణీత శాతం మించితే ఇబ్బందే. నిజానికి ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ ప్రస్తుతం 8–9 శాతం మధ్యనే ఉంటోంది. ఇంటి రుణం కోసం చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను పరంగా మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ అసలు ఏమీ లేనట్టే భావించొచ్చు.

అసలు భారమే కాని ఇంటి రుణాన్ని తీర్చేయాలన్న యోచనలో దీర్ఘకాలంలో 12 శాతం పైగా రాబడులను ఇచ్చే ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం ఆర్థిక ప్రణాళిక లోప మే అవుతుంది. ఇక కొందరికి అప్పు ఉందంటే నిద్ర పట్టదు. అందుకే తీసుకునే వరకూ నిద్రపోరు. దాన్ని తీర్చేవరకూ ప్రశాంతంగా ఉండరు. ఇంటి రుణంపై ప్రారంభంలో కొన్నేళ్లు వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఒకవేళ అప్పు తొందరగా తీర్చేయాలని అనుకుంటే ఏడేళ్ల తరువాత ముందస్తుగా తీర్చేయొచ్చు. అలాగైతే వడ్డీపై పన్ను ప్రయోజనాలన్నీ అప్పటిదాకా కలిసివస్తాయి.

బీమా ప్రీమియం...
సతీష్‌ (50) ఓ ఉద్యోగి. నెల జీతం రూ.60,000. యులిప్‌ పాలసీలకు, రెండు సంప్రదాయ పాలసీలకు కలిపి నెల నెలా రూ.21,000 (జీతంలో 35 శాతం) చెల్లించేవాడు.  పన్ను ఆదాకు, సురక్షితమైన చక్కని రాబడుల కోసం వీటిని అతడి ఎంచుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత... రాబడులు తన లక్ష్యాలకు అనుగుణంగా లేవని గుర్తించాడు. దీంతో భారంగా మారిన అన్ని సంప్రదాయ పాలసీలను సరెండర్‌ చేసి వచ్చినంత వెనక్కి తీసుకున్నాడు. పెట్టుబడుల కోణంలో ఒకటికి మించిన పాలసీలను తీసుకుని ఉంటే, ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులను ఇవ్వలేవు కనుక వాటిని వదిలించుకోవడమే బెటర్‌. అయితే, పాలసీలను రద్దు చేసుకునే ముందు సరెండ్‌ వేల్యూ ఎంత వస్తుందో తెలుసుకుని.. ఓ నిర్ణయం తీసుకోవాలి. నష్టపోయేది కొద్దిగానే ఉండి, పాలసీ ముగియడానికి ఇంకా కొన్నేళ్ల పాటు సమయం ఉంటే రద్దు చేసుకోవడమే కరెక్టు.

బీమా... పెట్టుబడికాదు!
బీమా అన్నది కేవలం రక్షణ కోసమే అయి ఉండాలి. టర్మ్‌ పాలసీలు ఈ కోవకు చెందినవే. వీటి ప్రీమియం సంప్రదాయ పాలసీలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ, కవరేజీ ఎక్కువ. అయినా కూడా చాలామంది సంప్రదాయ పాలసీలకే మొగ్గు చూపుతుంటారు. వీటికి ప్రీమియం ఎక్కువ, బీమా రక్షణ తక్కువ. పైగా వీటిపై వచ్చే రాబడులు కూడా 5–6 శాతాన్ని మించవు. ఇక, వైద్య బీమా, క్రిటికల్‌ ఇల్‌నెస్, వాహన బీమా, గృహ బీమాలను కూడా కలిసి చూస్తే ప్రీమియం రూపంలో చెల్లించాల్సిన మొత్తం భారీగానే ఉంటుంది.  పాలసీలు ఏవైనా కానీయండి... వాటికి చెల్లించే ప్రీమియం ఏడాదిలో ఓ వ్యక్తి ఆదాయంలో 6 –7 శాతాన్ని మించకుండా చూసుకోవాలి. టర్మ్‌ పాలసీ తీసుకునే వారు తమ వార్షికాదాయానికి పది రెట్ల మొత్తం, దీనికి అదనంగా అప్పులు తీసుకుని ఉంటే ఆ మొత్తానికి కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

వ్యక్తిగత, ఇతర రుణాలు
కొంత మంది వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వివాహాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటుంటారు. వడ్డీ భారం ఎక్కువగా ఉండే వ్యక్తిగత రుణాలను ఎక్కువగా తీసుకోవటం సరికాదు. తప్పనిసరి అయితే వీటికి చేసే చెల్లింపులు తమ వేతనంలో 10 శాతం దాటకుండా చూసుకోవాలనేది ఒక నియమం. అంతకు మించితే అది ఆర్థిక లక్ష్యాలకు విఘాతంగా మారుతుంది. వేతనంలో 50 శాతం దాటితే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా