12వేల ఉద్యోగాలకు ఇంటెల్ కోత

25 Apr, 2016 17:31 IST|Sakshi
12వేల ఉద్యోగాలకు ఇంటెల్ కోత

అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ ప్రపంచవ్యాప్తంగా 12వేల ఉద్యోగాల కోత విధించనున్నట్టు ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. కొత్తగా టెక్నాలజీ వాడే వినియోగదారులందరూ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుండడంతో, డెస్క్ టాప్ వ్యాపారాలపై తక్కువగా దృష్టిసారించనున్నట్టు ఇంటెల్ పేర్కొంది.


మైక్రోసాప్ట్, హ్యూలెట్ ప్యాకర్డ్  లాంటి కంపెనీలు సైతం పర్సనల్ కంప్యూటర్ పరిశ్రమ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీల సరుకు రవాణా మొదటి త్రైమాసికంలో 11.5 శాతం పడిపోయిందని టెక్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా పేరున్న ఇంటెల్, ఈ ఏడాది ఆర్జించే ఆదాయాలు తక్కువగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఇంటెల్ షేర్లు సైతం 2.2 శాతం తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి.

ఇంటెల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా అమెరికాలో ఉండటంతో, ఎక్కడ ఉద్యోగుల కోత విధించనున్నారో తెలియాల్సి ఉంది. ఇలా ఉద్యోగాల కోత 2017 మధ్య వరకూ కొనసాగిస్తామని ఇంటెల్ పేర్కొంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్న స్టేసీ స్మిత్‌కు కంపెనీ ఉత్పత్తి అమ్మకాలు, తయారీ కార్యకలాపాలు నిర్వర్తించే బాధ్యతను అప్పజెప్పింది. కంపెనీకి కొత్త సీఈవోను నియమించే ప్రక్రియ కొనసాగుతుందని ఇంటెల్ తెలిపింది. మార్కెట్లో పడిపోతున్న పీసీ అమ్మకాలను పునరుద్ధరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు స్మిత్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు