పొదుపు బాండ్లపై తగ్గిన వడ్డీ!

3 Jan, 2018 00:41 IST|Sakshi

8%కి బదులు ఇక 7.75%

న్యూఢిల్లీ: ఎనిమిది శాతంవడ్డీ లభించే  ప్రభుత్వ (పన్ను పరిధిలోకి వచ్చే) పొదుపు బాండ్లు పొందేందుకు కాలపరిమితి ఈ నెల 2వ తేదీతో ముగిసిపోయిందని విచారపడే వారికిది కాస్తంత ఉపశమనం కలిగించే వార్తే. ఈ పొదుపు బాండ్లను కేంద్రం మరోసారి ఆవిష్కరిస్తోంది. అయితే ఈ బాండ్లపై వడ్డీ రేటును మాత్రం ఈ సారి 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గిస్తోంది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఇటీవల కేంద్రం వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. అయితే 7.75 శాతంతో కూడిన పొదుపు బాండ్లు కూడా ఇతర  స్థిర ఆదాయ ప్రొడక్టులతో పోల్చితే అధిక రాబడులనే అందిస్తాయి.

ఆర్‌బీఐ బాండ్ల స్కీమ్‌ అని కూడా పేరున్న ఈ 8 శాతం సేవింగ్స్‌ బాండ్స్‌ స్కీమ్‌ను కేంద్రం 2003లో తీసుకువచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్‌ 21న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైంది. బాండ్‌ కాలపరిమితి ఆరేళ్లు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రత్యేకించి ప్రవాస భారతీయుల నుంచి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అయితే ఇవి పన్ను రహిత బాండ్లు కాదు. వీటిపై వచ్చే వడ్డీకి ఆయా వర్గాల ఆదాయపు పన్ను శ్లాబ్‌ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు