గృహ రుణంలోనూ కలసికట్టుగా...

11 Nov, 2019 05:57 IST|Sakshi

దంపతులు జాయింట్‌గా తీసుకుంటే బెటర్‌

అధిక మొత్తంలో గృహ రుణానికి వీలు

కలసి దరఖాస్తు చేయడం వల్ల మెరుగైన అర్హత

ఈఎంఐ భారం.. చెల్లింపుల కాలవ్యవధి తగ్గుతుంది..

తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం

పన్ను ఆదా లాభాలూ ఎక్కువే  

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అధిక మొత్తంలో రుణం సమకూరడమేకాదు, పన్ను ప్రయోజనాలు... తక్కువ నెలవారీ వాయిదా(ఈఎంఐ) వంటి లాభాలెన్నో జాయింట్‌ హోమ్‌లోన్‌తో పొందొచ్చు. కొత్తింటి ప్రణాళికల్లో ఉన్నవారికి ఉమ్మడి గృహ రుణంపై అవగాహన కల్పించే కథనమిది...

శ్రీనివాస కుమార్‌ (40) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన శ్రీమతి సుమలత (37) కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు 2013లో జాయింట్‌ హోమ్‌ లోన్‌ (ఉమ్మడిగా గృహ రుణం)ను ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి తీసుకున్నారు. ఇలా కలసి తీసుకోవడానికి కారణం జాయింట్‌ లోన్‌పై వడ్డీ రేటు తక్కువగా ఆఫర్‌ చేయడమే. రూ.44 లక్షల రుణం తీసుకున్నారు. వడ్డీ రేటు నాడు  9.5 శాతంగా ఉంటే, శ్రీనివాస కుమార్‌ దంపతులకు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 10 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ చేసింది. పైగా ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవడం వల్ల రుణ అర్హత అధికంగా ఉంటుంది.

రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, అర్హత మెరుగ్గా ఉండడమే తాము జాయింట్‌లోన్‌ తీసుకోవడానికి కారణాలుగా శ్రీనివాస్‌ కుమార్‌ వెల్లడించారు. జాయింట్‌ లోన్‌ ద్వారా మంచి ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు వీలు పడుతుంది. బడ్జెట్‌ ఎక్కువైనా కానీ, ఇద్దరు పేరిట రుణం తీసుకుంటున్నారు కనుక అధిక అర్హతలతో బ్యాంకు కూడా ఎక్కువే ఆఫర్‌ చేస్తుంది. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైనా లేదా ఆర్జనా పరులైతే, కలసి ఉమ్మడి రుణం తీసుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

మీరు నవ దంపతులు అయి ఉండి, ఇద్దరూ ఆర్జనా పరులైతే కలసి గృహ రుణం తీసుకునే ఆలోచన తప్పకుండా చేయవచ్చు. ‘‘రియల్‌ ఎస్టేట్‌ కొనుగోలు అధిక వ్యయంతో కూడుకుని ఉంటుంది. దీంతో సొంతింటి కల అన్నది ఒక్కరే ఆర్జనా పరులున్న కుటుంబానికి అంత సులభం కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి సహ రుణ గ్రహీతగా చేరడం వల్ల ఇద్దరి ఆర్జనను కలపడం, ఇద్దరి క్రెడిట్‌ స్కోరుతో మరింత మొత్తం గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే సొంతం చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్‌ సీఈవో ఆదిల్‌శెట్టి పేర్కొన్నారు. కలసి తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పరిశీలించినట్టయితే...

భారీ మొత్తంలో రుణం
ఇద్దరు కలసి ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా అర్హత ఎక్కువగా ఉంటుంది. దీంతో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి చూసి బ్యాంకు పెద్ద మొత్తంలో రుణాన్ని ఆఫర్‌ చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే.. అందుకు మీ వంతు డౌన్‌ పేమెంట్‌ 20 శాతం (రూ.20లక్షలు) పోను మరో రూ.80 లక్షలను 20 ఏళ్ల కాలానికి రుణంగా తీసుకోవాల్సి ఉంటుందని అనుకుంటే, అప్పుడు 8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.70,000 అవుతుంది.

సాధారణంగా రుణగ్రహీత ప్రతీ నెలా నికరంగా అందుకునే వేతనంలో గరిష్టంగా 50 శాతం వరకూ ఈఎంఐ కింద బ్యాంకులు అనుమతిస్తుంటాయి. దీని ప్రకారం రూ.80 లక్షల గృహ రుణం తీసుకోవాలంటే, ప్రతీ నెలా నికరంగా రూ.1.4 లక్షలను అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా ఆర్జిస్తున్నట్టు అయితే.. ఇద్దరూ కలసి ఈ మొత్తాన్ని చెల్లించే శక్తి కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువే చెల్లించే సామర్థ్యం ఉంటే మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఇంటి కోసం ఇంకా అధిక రుణం తీసుకునేందుకు ప్లాన్‌ చేసుకోవచ్చు.  

వేగంగా చెల్లింపులు
ఇద్దరు కలసి రుణం తీసుకుంటే, తిరిగి చెల్లించడం సులభం కావడమే కాకుండా, వేగంగా దాన్ని తీర్చేయవచ్చు. వార్షికంగా వచ్చే బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే పారితోషికాన్ని ఇలా గృహ రుణం తీర్చేందుకు వినియోగించినా వాస్తవ కాల వ్యవధి కంటే ముందే గృహ రుణం ముగిసిపోతుంది. ఎందుకంటే చెల్లింపులపై ఎటువంటి నియంత్రణలు ఉండవు. దీనివల్ల వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది.  

రిజిస్ట్రేషన్‌ వ్యయం తక్కువ
కొన్ని బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే మహిళలకు ఇల్లు/ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ తక్కువగా అమల్లో ఉంది. ‘‘ఉమ్మడి గృహ రుణంలో ప్రధాన దరఖాస్తు దారుగా భార్య ఉంటే వ్యయాలను తగ్గించుకోవచ్చు. గృహ రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, రిజిష్ట్రేషన్‌ చార్జీలో తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు’’ అ ని మైమనీమంత్రా డాట్‌ కామ్‌ ఎండీ రాజ్‌ ఖోస్లా చెప్పారు.  

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం
ఉమ్మడిగా రుణం తీసుకుంటే దంపతులిద్దరిపై సమానంగా చెల్లింపుల భాధ్య త ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒకరు ఉద్యోగం కోల్పోతే ఆ మేరకు గృహ రుణ ఈఎంఐ చెల్లింపులో నెలసరి వాటా అందకపోవచ్చు. ఈ కారణంగా ఈఎంఐ చెల్లింపులో వైఫల్యం చెందితే అప్పుడు ఇద్దరి క్రెడిట్‌ స్కోరుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘‘తిరిగి చెల్లింపుల బాధ్యత దంపతులపై పూర్తిగా ఉంటుంది. ఒక్కరు చెల్లింపుల్లో వైఫల్యం చెందినా ఇద్దరి క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది’’ అని ఆదిల్‌శెట్టి తెలిపారు.

పన్ను ప్రయోజనాలు
ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవడం వల్ల అధిక పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. దంపతులు ఉమ్మడిగా రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్‌ 80సీ కింద చెరో రూ.1.5 లక్షల చొప్పున రూ.3లక్షలు, సెక్షన్‌ 24(బి) కింద రూ.4లక్షల వడ్డీపై (చెరో రూ.2లక్షలు) పన్ను ప్రయోజనం లభిస్తుంది. మధ్యాదాయ వర్గాల నుంచి కొంచెం అధిక ఆర్జనా పరులకు ఈ మేరకు పన్ను ఆదా రూపంలో గణనీయంగానే మిగులుతుంది.


వీటిని అనుసరిస్తే మేలు..
రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధిలో ఇంటి యజమాని మరణిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విల్లు రాసుకోవడం మంచిది. ఇక వైవాహిక జీవితం నూటికి నూరు పాళ్లు కలసి సాగుతుందని నేటి రోజుల్లో చెప్పడం కష్టమే. కనుక ఉమ్మడిగా గృహ రుణానికి వెళ్లే దంపతులు.. ఇంటిలో వాటా, తిరిగి రుణానికి చేయాల్సిన చెల్లింపులు, ఇతర అంశాలపై స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం ఇంకా మంచిది.

దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ ఇద్దరూ విడిపోవాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక గృహ రుణం తీసుకునే సమయంలోనే రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కూడా తీసుకోవడం తప్పనిసరిగా చేయాల్సినది. రుణ గ్రహీతకు ఏదైనా జరిగితే, కుటుంబంపై రుణ చెల్లింపుల బాధ్యతలు పడకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గృహ రుణ గ్రహీతల్లో ఒకరు మరణించడం వల్ల మరొకరిపై చెల్లింపుల బాధ్యత పడకుండా ఈ టర్మ్‌ప్లాన్‌ ఆదుకుంటుంది.

విడాకులు, మరణం...
దంపతులు ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత జీవితంలో ఇకమీదట కలసి సాగకూడదని విడాకులకు వెళితే పరిస్థితి ఏమిటి..? గృహ రుణాన్ని తిరిగి చెల్లించడం తప్పనిసరి. కాకపోతే ఇందుకు మార్గాన్ని వారే అన్వేషించుకోవాలి.

‘‘బ్యాంకు తన బకాయిలను వసూలు చేసుకునేందుకు చర్యలు చేపడుతుంది. అవసరమైతే న్యాయపరమైన చర్యలనూ చేపట్టవచ్చు. అందుకని భవిష్యత్తులో విడిపోవాల్సి వస్తే గృహ రుణ చెల్లింపుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై దంపతులు ముందుగానే ఓ స్పష్టమైన అంగీకారానికి రావడం మంచిది’’ అని ఆదిల్‌శెట్టి సూచించారు. ఇక దురదృష్టవశాత్తూ ఉమ్మడి గృహ రుణం తీసుకున్న తర్వాత దంపతుల్లో ఒకరు మరణించినట్టయితే అప్పుడు చెల్లింపుల బాధ్యత పూర్తిగా రెండోవారిపై పడుతుంది.

మరిన్ని వార్తలు