మరోసారి వడ్డీరేట్లు తగ్గొచ్చు...

29 Jun, 2015 00:45 IST|Sakshi
మరోసారి వడ్డీరేట్లు తగ్గొచ్చు...

నైనాలాల్ కిద్వాయ్ అభిప్రాయం
 
 ఆర్‌బీఐ ఈ ఏడాది కీలక రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కానీ ఈ తగ్గింపును బ్యాంకులు పూర్తిస్థాయిలో రుణగ్రహీతలకు అందించలేకపోయాయి.  దీనికి ప్రధాన కారణం డిపాజిట్ల రేట్లు అధిక స్థాయిలో ఉండటమే.
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో వడ్డీరేట్లు తగ్గింపు దిశగా పునరాలోచించే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్ డెరైక్టర్, ఇండియా చైర్మన్ నైనాలాల్ కిద్వాయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం దిగువస్థాయిలో ఉండటం, అంచనాలను మించి రుతుపవనాల కదలికలు ఉండటంతో వడ్డీరేట్లు మరో పావు శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. ‘30 ఉమెన్ ఇన్ పవర్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కిద్వాయ్ తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.

గత పరపతి విధాన సమీక్షలో ఇప్పట్లో ఇక వడ్డీరేట్లు తగ్గే అవకాశం లేదని ఆర్‌బీఐ పరోక్షంగా సంకేతాలను ఇచ్చిన విషయం విదితమే. ఈ ఏడాదిలో ఆర్‌బీఐ ఇప్పటికే కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించిందని, కానీ ఈ తగ్గింపును బ్యాంకులు పూర్తిస్థాయిలో రుణ గ్రహీతలకు అందించలేకపోయాయని, దీనికి ప్రధాన కారణం డిపాజిట్ల రేట్లు అధిక స్థాయిలో ఉండటమేనన్నారు. డిపాజిట్ల రేట్లు తగ్గితే కాని రుణాల రేట్లు తగ్గే అవకాశం లేదని, వచ్చే రెండు మూడు నెలల్లో డిపాజిట్ల రేట్లు 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగానికి ఎన్‌పీఏలు గుదిబండగా మారిన మాట వాస్తవమే అయినా... కొత్త ఎన్‌పీఏలు ఏర్పడకపోవడం శుభపరిణామమన్నారు. ఒక్కసారి వృద్ధిరేటు పెరిగితే ఎన్‌పీఏలు తగ్గుముఖం పడతాయన్నారు. కొత్తగా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీడీపీ గణాంకాలు కొంత గందరగోళాన్ని సృష్టించిన మాట వాస్తవమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రానున్న కాలంలో ఈ వృద్ధిరేటు వాస్తవ రూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు