రాబడులకు ఢోకా లేదు!

11 Mar, 2019 00:49 IST|Sakshi

యాక్సిస్‌ స్ట్రాటజిక్‌ బాండ్‌ ఫండ్‌ 

ఆర్‌బీఐ ఇటీవలి రేట్ల కోతతో వడ్డీ రేట్లు మళ్లీ తిరుగుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. దీంతో తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. ద్రవ్య, కరెంటు ఖాతా లోటు పరంగా ఒత్తిళ్లు నెలకొని ఉన్నాయి. కనుక ఈ పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం తొందరపాటే అవుతుంది. దీంతో మధ్యస్థ రిస్క్‌ తీసుకునే మీడియం డ్యురేషన్‌ ఫండ్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం తక్కువ. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న మార్గాల్లో యాక్సిస్‌ స్ట్రాటజిక్‌ బాండ్‌ ఫండ్‌ కూడా ఒకటి. పెద్దగా రిస్క్‌ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పునర్వ్యస్థీకరణకు ముందు వరకు ఈ పథకం యాకిŠస్‌స్‌ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ పేరుతో కొనసాగింది. 

పెట్టుబడుల విధానం 
ఈ పథకం పెట్టుబడుల విషయంలో ఎక్కువ రిస్క్‌ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్లలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్‌ ఉన్నవే. అలాగే, ఏ రేటింగ్‌ సాధనాలు కూడా ఉన్నాయి. పైగా ఇవన్నీ బడా కంపెనీలు జారీ చేసినవి కావడం గమనార్హం. మొత్తం మీద 80 శాతం పెట్టుబడులు ఏఏ అంతకంటే ఎక్కువ రేటింగ్‌ కలిగినవి. ఏ రేటింగ్‌ కలిగినవి 16 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. కార్పొరేట్‌ డెట్, జీరో కూపన్‌ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడులు ఉన్నాయి. 

రాబడులు 
గడిచిన ఐదేళ్ల కాలంలో యాక్సిస్‌ స్ట్రాటజిక్‌ బాండ్‌ ఫండ్‌ వార్షికంగా 9.4 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం ఈ పథకం చక్కని పనితీరుకు నిదర్శనం. మూడేళ్ల కాలంలో చూసుకున్నా వార్షికంగా 8.8 శాతం మేర ఉన్నాయి. ఇక ఏడాది కాలంలో రాబడులు 7 శాతంగా ఉండడం గమనార్హం. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. ఈ విభాగం సగటు రాబడులు ఏడాది కాలంలో 5.9 శాతంగా ఉండగా, మూడేళ్లలో 7.7 శాతం, ఐదేళ్లలో 8.4 శాతం చొప్పున ఉన్నాయి. ఈ కేటగిరీలోని అత్యుత్తమ పథకాల్లో ఇదీ ఒకటిగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ మీడియం టర్మ్‌ డెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మీడియం టర్మ్‌ బాండ్‌ పథకాల కంటే ఈ పథకమే ఎక్కువ రాబడులు ఇచ్చింది. బాండ్‌ ఫండ్స్‌ కావడంతో ఈ పథకాల్లో సిప్‌ మార్గం పెద్దగా పనిచేయదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా