కారు.. బైకు.. చవక

18 Feb, 2014 03:03 IST|Sakshi
కారు.. బైకు.. చవక

* తగ్గనున్న కార్లు, టూవీలర్ల ధరలు
* 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిన ఎక్సైజ్ సుంకం
* బియ్యం నిల్వ, లోడింగ్, అన్‌లోడింగ్‌పై సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు
* ఉత్పాదక వస్తువులపైనా పన్ను
* 12 నుంచి 10 శాతానికి తగ్గింపు
* టీవీలు, ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్లూ ఇక చవక
* అన్ని మొబైల్ ఫోన్లపై 6 శాతం ఎక్సైజ్ పన్ను
 
 న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌ను పురస్కరించుకుని.. తయూరీరంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు ప్రకటించింది. దీంతో ఎస్‌యూవీలు (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) సహా చిన్నకార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణపరమైన ఉత్పాదకత కూడా గత కొద్దినెలలుగా మందగమనంలో ఉంది. దీంతో కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపైనా ఆర్థికమంత్రి చిదంబరం పన్ను తగ్గింపును ప్రకటించారు. దీంతో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వస్తువుల ధరలూ తగ్గనున్నారుు.
 
- అమ్మకాలు తగ్గిన ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపశమనం కలిగేలా కార్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. చిన్న కార్లు, మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై 12 శాతంగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది. ఎస్‌యూవీలపై పన్ను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. పెద్ద వాహనాలపై సుంకం 27 శాతం నుంచి 24 శాతానికి, మధ్యతరహా కార్లపై పన్ను 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే జూన్ 20 వరకు వర్తిస్తుంది.
-    బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకింగ్, నిల్వపై సర్వీస్ ట్యాక్స్‌ను (సేవాపన్ను) మినహారుుస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. కార్డ్ బ్లడ్ బ్యాంకులందించే సేవలను కూడా సేవా పన్ను నుంచి మినహాయించారు.
 -    అలాగే కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర వస్తువులపై 12 శాతంగా ఉన్న పన్నును 10 శాతానికి తగ్గించారు. ఇది ఈ ఏడాది జూన్ 30 వరకు వర్తిస్తుంది.
-    దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులను నిరుత్సాహ పరిచే దిశగా అన్ని కేటగిరీల మొబైల్ ఫోన్ల (హ్యాండ్‌సెట్లు)కు సంబంధించిన ఎక్సైజ్ సుంకాలను 6 శాతానికి పునర్వ్యవస్థీకరించారు. దీంతో రూ.2 వేల లోపు ఉండే తొలిస్థారుు హ్యాండ్‌సెట్ల ధర పెరగనుంది.
 -    సబ్బులు, ఓలియో రసాయనాల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక చమురు, సంబంధిత ఉత్పత్తులు, కొవ్వుతో కూడిన ఆమ్లాలు, కొవ్వుతో కూడిన మద్యంపై దిగుమతి సుంక నిర్మాణాన్ని 7.5 శాతం వద్ద హేతుబద్దీకరించింది.
 
 ఈఈపీసీ హర్షం
 ముంబై: కార్లు, టూ వీలర్లపై సుంకాన్ని తగ్గించడంపై ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారుల సంస్థ (ఈఈపీసీ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతికి ఊతం ఇస్తుందని ఈఈపీసీ చైర్మన్ అనుపమ్ షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వదేశీ వాహన పరిశ్రమలో తిరిగి వృద్ధిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
 
 మనకు 2000 కోట్లు కోత..  తగ్గిన కేంద్ర పన్నుల వాటా
-     ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాను రూ. 22,131.68 కోట్లకు తగ్గించిన కేంద్రం
-     వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా 26,970 కోట్లు
-  గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లోనూ కోత

 
 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వస్తాయనుకున్న నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులను కూడా సవరించారు. ఈ సవరణలతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ తొలి అంచనాల్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.24,132.36 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.22,131.68 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.27,028 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలపగా, కేంద్ర బడ్జెట్‌లో మాత్రం రూ.26,970 కోట్లు కేటాయించారు.
 
 అంటే రాష్ట్ర బడ్జెట్‌లో పేర్కొన్న దానికన్నా రూ.58 కోట్లు తగ్గుతోంది. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ.77,060 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం గత బడ్జెట్‌లో పేర్కొంది. అయితే ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ గ్రాంట్లను రూ.61,700 కోట్లకు తగ్గించారు. ఈమేరకు రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గనున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.43,776 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ నిధులను రూ.39,836 కోట్లకు తగ్గించింది. అంటే రాష్ట్రానికొచ్చే ప్రాయోజిత పథకాల నిధులు కూడా తగ్గిపోనున్నాయి.
 
 ఇవి తగ్గుతాయ్..
*   బియ్యం, సబ్బులు
మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు
*  చిన్నకార్లు, ఎస్‌యూవీలు
వాణిజ్య వాహనాలు
*   దేశంలో తయూరైన మొబైల్ ఫోన్లు
*   టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు
*  కంప్యూటర్లు, ప్రింటర్లు, కీబోర్డులు, మౌజ్‌లు, హార్డ్ డిస్క్‌లు, స్కానర్లు
*  వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, హెరుుర్ డయ్యర్‌లు
వాటర్ కూలర్లు, టార్చ్‌లైట్లు, డిజిటల్ కెమెరాలు
ఎలక్ట్రిక్ ఐరన్స్, ఎంపీ 3..డీవీడీ ప్లేయర్లు
* బ్లడ్ బ్యాంకుల చార్జీలు
 
 తొమ్మిదోసారి...

 ఫిబ్రవరి 17, 2014
 పి.చిదంబరం తొమ్మిదోసారి  కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
 ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు (8 సాధారణ, 2 మధ్యంతర బడ్జెట్‌లు) మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. స్వాతంత్య్రం తరువాత ఇప్పటివరకు మధ్యంతర, ప్రత్యేకమైనవి కలిపి మొత్తం 83 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.
 
 స్టూడెంట్స్‌కు గాలం!
 విద్యా బడ్జెట్‌లో దేనికి ఎంతెంత..?
 ఉన్నత విద్య- రూ.16,200 కోట్లు
 పాఠశాల విద్య-రూ.51,198 కోట్లు
 
 న్యూఢిల్లీ: విద్యారంగానికి కాస్త ఫర్లేదు.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.67,398 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కిందటేడాదితో పోలిస్తే దాదాపు 9 శాతం అదనం. అలాగే యూపీఏ సర్కారు ఎన్నికల ముంగిట విద్యార్థులను ఆకట్టుకునే యత్నం చేసింది. 2009, మార్చి 31కి ముందు విద్యా రుణాలు తీసుకొని 2013, డిసెంబర్ 31 వరకు వడ్డీ చెల్లించని విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వడ్డీని పూర్తిగా తామే భరిస్తామని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ ప్రతిపాదనతో 9 లక్షల మంది విద్యార్థులకు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కెనరా బ్యాంకుకు బదిలీ చేయనున్నట్టు తెలిపారు. 2009-10 బడ్జెట్‌లో ప్రణబ్ ముఖర్జీ... విద్యార్థులు తీసుకున్న రుణాల్లో వడ్డీపై రాయితీ ఇచ్చేందుకు సెంట్రల్ స్కీమ్ ఫర్ ఇంటరెస్ట్ సబ్సిడీ(సీఎస్‌ఐఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను కెనరా బ్యాంకుకు అప్పజెప్పినవిషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు