అంతర్జాతీయ అంశాలు కీలకం

20 Nov, 2017 01:55 IST|Sakshi

ఫెడ్‌ మినిట్స్‌పై దృష్టి 

సానుకూలంగానే మార్కెట్‌ 

విశ్లేషకుల అంచనా  

కంపెనీల క్యూ2 ఫలితాల వెల్లడి దాదాపు పూర్తికావడంతో ఇక ఇప్పుడు మన మార్కెట్‌పై అంతర్జాతీయ అంశాల ప్రభావం ఉంటుందని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు... తదితర అంశాలు స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. మొత్తం మీద ఈ వారం స్టాక్‌ సూచీలు సానుకూలంగానే కదులుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో మరిన్ని నిధులు...
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు... ఈ వారం గమనించదగ్గ కీలకాంశాల్లో ఒకటని హెడ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌(ప్రైవేట్‌ క్లయింట్‌ గ్రూప్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ) వి.కె.శర్మ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై  ఫెడ్‌ అభిప్రాయాలు, వడ్డీరేట్లపై అంచనాలు తదితర అంశాలు ఈ సమావేశ వివరాల ద్వారా వెల్లడయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మార్కెట్‌ సానుకూలంగానే ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

భారత సావరిన్‌ రేటింగ్‌ను మూడీస్‌ సంస్థ అప్‌గ్రేడ్‌ చేయడంతో మార్కెట్‌ గమనం మారినట్లుగా అనిపిస్తుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా మార్కెట్లోకి మరిన్ని నిధులు వస్తాయని పేర్కొన్నారు.. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ మినిట్స్‌ వెల్లడి కారణంగా మార్కెట్లో ఒకింత ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కంపెనీల ఫలితాల సీజన్‌ దాదాపు పూర్తి కావడంతో మన మార్కెట్‌గమనం..విదేశీ సంకేతాలపై ఆధారపడి ఉంటుందని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు.  

ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, నేడు(సోమవారం) జపాన్‌ వాణిజ్య గణాంకాలు, మంగళవారం(ఈ నెల 21న) అమెరికా ఇళ్ల విక్రయ గణాంకాలు వస్తాయి. ఇక బుధవారం (ఈ నెల 22న) అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు, ముడి చమురు నిల్వలు, మన్నికైన వస్తువుల ఆర్డర్లు, నిరుద్యోగ గణాంకాలు వెలువడుతాయి. ఈ నెల 23న (గురువారం) యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశ వివరాలు, యూరప్‌ తయారీ, సేవల రంగాల పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) గణాంకాలు వస్తాయి. థ్యాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా గురువారం (ఈ నెల 23న)అమెరికా, జపాన్‌ మార్కెట్లకు సెలవు. ఇక శుక్రవారం రోజు జపాన్‌ తయారీ రంగ, అమెరికా తయారీ, సేవల రంగ పీఎంఐ గణాంకాలు వస్తాయి.

దాదాపు 13 సంవత్సరాల తర్వాత భారత సావరిన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను మూడీస్‌ సంస్థ గత శుక్రవారం అప్‌గ్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక, సంస్థాగత సంస్కరణలు కొనసాగుతుండటంతో వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని మూడీస్‌ సంస్థ వ్యాఖ్యానించింది.


సూచీ షేర్లలో మార్పుచేర్పులు..
సెన్సెక్స్‌ షేర్లలో కొత్తగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యస్‌బ్యాంక్‌లను చేర్చనున్నారు. ఫార్మా షేర్లు–లుపిన్, సిప్లాల స్థానంలో ఈ షేర్లను చేరుస్తున్నారు. ఈ మార్పులు వచ్చే నెల 18 నుంచి అమల్లోకి వస్తాయి. మరోవైపు బీఎస్‌ఈ 100 సూచీలో ఫెడరల్‌ బ్యాంక్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, వక్రంగీ, బజాజ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ షేర్లను చేర్చనున్నారు.  

రూ.14 వేల కోట్ల మేర విదేశీ ఈక్విటీ పెట్టుబడులు..
మన స్టాక్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు మళ్లీ జోరందుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లో రూ.14,328 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ బ్యాంక్‌ల మూలధన నిధుల ప్రణాళిక, రూపాయి నిలకడ, అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ మెరుగుపడడం దీనికి కారణాలని నిపుణులంటున్నారు.

గత నెలలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులు రూ.3,000 కోట్లు. అంతకు ముందు ఆగస్టు–సెప్టెంబర్‌ నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌ నుంచి రూ.24,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటివరకూ డెట్‌మార్కెట్‌ నుంచి రూ.1,287 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.  ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు  స్టాక్స్‌లో రూ.51,756 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.1.45 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌చేశారు.

మరిన్ని వార్తలు