వేసిన రిటర్నులో తప్పులున్నాయా?

3 Oct, 2016 01:17 IST|Sakshi
వేసిన రిటర్నులో తప్పులున్నాయా?

* కంగారు పడకండి.. లోపాలు సవరించొచ్చు   
* 15 రోజులు గడువు; పట్టించుకోకుంటే రిటర్ను రద్దు కావచ్చు

ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేసిన వాటిని అధికారులు పరిశీలిస్తారు. రిటర్నులో ఏమైనా లోపాలుంటే వాటిని లోపభూయిష్టమైన రిటర్నులు లేదా అసంపూర్తి రిటర్నులుగా పిలుస్తారు. ఈ విషయాన్ని రిటర్ను వేసిన వారికి అధికారులు తెలియజేస్తారు. ఇలా మనం వేసిన రిటర్నులు అసంపూర్తి రిటర్నులు అని తేలితే.. వాటిని 15 రోజుల్లోగా సవరించాలి. అవసరమైతే అదనపు వ్యవధి అడగవచ్చు. గడువు లోపల సవరించకపోతే మీరు వేసిన రిటర్ను చెల్లదు. రద్దవుతుంది. కానీ మీరు సవరిస్తే కాస్త అటూఇటూ అయినా కూడా అధికారులు సహకరిస్తారు.
 
ఏ సందర్భాల్లో లోపాలు ఏర్పడవచ్చు..

* ఐటీ ఫారాలు 1 నుంచి 8 దాకా అమలులో ఉన్నాయి. ప్రతి ఫారంలో ఎన్నో అంశాలుంటాయి. ప్రతి దానికి ఎదురుగా జవాబు రాయాలి. వర్తించకపోతే స్పష్టంగా వర్తించదని..  నిల్ అయితే నిల్ అని.. రాయాలి. అంతేతప్ప ఏ కాలమ్‌ను ఖాళీగా ఉంచకూడదు. జవాబివ్వకపోవడమూ లోపమే అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* రిటర్నుతో పాటు కొన్ని స్టేట్‌మెంట్లు, రిపోర్టులు, ట్యాక్స్ చలానాలు జతపరచాలి. ఈ-ఫైలింగ్‌లో ఎటువంటి వాటిని జతపరచనవసరం లేదు. అయితే అసెసింగ్ అధికారులు అసెస్‌మెంట్ చేస్తున్నప్పుడు కాగితాలు అడుగుతారు. అన్నింటినీ భద్రపరచుకుంటే బాగుంటుంది.
* లాభనష్టాలకు సంబంధించిన అంశాలను తెలపకపోతే రిటర్ను డిఫెక్ట్ అవుతుంది.
* ఆస్తి, అప్పుల పట్టీకి సంబంధించి ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలియజేయాలి. అలా కానిపక్షంలో రిటర్నులను డిఫెక్ట్‌గా పరిగణిస్తారు.
* భాగస్వామి విషయంలో వ్యక్తిగత అకౌంట్ అంటే వ్యాపారపు ఖాతా వివరాలు ఇవ్వకపోయినా.. ఆడిట్ వర్తించే కేసుల్లో ఆడిటర్ వివరాలు చూపకపోయినా.. బుక్స్ రాయనవసరం లేనప్పుడు నగదు నిల్వలు, రుణ దాత లు, రుణగ్రస్తులు, ముగింపు సరుకు వివరాలు తెలపకపోయినా.. ట్యాక్స్ చెల్లించకుండా చెల్లించినట్లు చూపించినా.. ఆ రిటర్నులను డిఫెక్ట్‌గా పరిగణిస్తారు.
 
డిఫెక్ట్- ఇన్‌వాల్యూడ్... తేడా ఏంటి?
డిఫెక్ట్ రిటర్నుని సవరించకపోతే ఇన్‌వాల్యూడ్ రిటర్ను అవుతుంది. అంటే అప్పుడు మనం రిటర్ను వేయనట్లే. అయితే సెక్షన్ 292 బి ప్రకారం తప్పు/లోపం/విడిచిపెట్టడం/మరచిపోవడం/తొలగించడం వంటి అంశాల వలన రిటర్ను రద్దు కాదు. కాని సెక్షన్ 149 (9)కి బలం ఎక్కువ. నిర్దేశించిన  లోటుపాట్లు సవరించకపోతే డిఫెక్ట్ రిటర్ను రద్దవుతుంది. అంటే రిటర్ను దాఖలు చేయనట్లే. అప్పుడు రిటర్ను దాఖలు చేయకపోతే ఏ ఏ పెనాల్టీలు విధిస్తారో ఆ అన్నింటినీ వడ్డిస్తారు. అందుకే తగిన జాగ్రత్త వహించండి.

మరిన్ని వార్తలు