పరుగెట్టే స్టాక్స్‌ను ముందే పట్టుకునే ఫండ్‌

1 Oct, 2018 01:47 IST|Sakshi

ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్‌

స్మాల్, మిడ్‌క్యాప్‌ విభాగంలో భారీగా పెరిగి, అధిక విలువలకు చేరిన స్టాక్స్‌... ఇటీవలి కరెక్షన్‌లో భారీగా పడడాన్ని చూసే ఉంటాం. వీటిల్లో ఆణిముత్యాలను పట్టుకుని ఇన్వెస్టింగ్‌ చేయడమే వ్యాల్యూ ఫండ్స్‌ చేసే పని. బాగా పడిన స్టాక్స్‌ లేదా, అధిక విలువ కలిగి, తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నవి, దీర్ఘకాల వృద్ధికి అవకాశాలు బలంగా ఉన్నవి పెట్టుబడులకు మంచి అవకాశాలు అవుతాయి. ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్‌ కూడా పెట్టుబడులకు ఈ విధానాన్నే ఆచరిస్తోంది.  

వివిధ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ఉన్న స్టాక్స్‌ను ఈ ఫండ్‌ కొనుగోలు చేస్తుంటుంది. అంటే మల్టీ క్యాప్‌ విధానంగానే భావించొచ్చు. ఫండమెంటల్స్‌ కంటే తక్కువ విలువకు ట్రేడవుతున్నవి, టర్న్‌ అరౌండ్‌కు అవకాశం ఉన్న స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అదే సమయంలో రాబడులను పెంచుకునేందుకు వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌ను కూడా ఎంచుకుంటుంది. 2007 ఏప్రిల్‌లో మార్కెట్లు చాలా గరిష్ట స్థాయిలకు చేరిన సమయంలో ఈ పథకం ఆరంభమైంది. బుల్, బేర్, ఒడిదుడుకులతో ఉన్న వివిధ మార్కెట్‌ కాల సమయాల్లో పనితీరు పరంగా మెరుగ్గా నిలిచింది.  

పనితీరు, విధానం
మూడింట ఒక వంతు పెట్టుబడులను మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌కు కేటాయించడం అన్ని వేళలా పాటిస్తుంటుంది. దీంతో ర్యాలీల్లో అధిక రాబడుల అవకాశాలను పదిలంగా ఉంచుకుంటుంది. ఇక లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు మార్కెట్‌ కరెక్షన్‌ సమయాల్లో నష్టాలను పరిమితం చేసేందుకు తోడ్పడతాయి. బుల్, బేర్‌ మార్కెట్లలోనూ ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకోదు. అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఈక్విటీ పెట్టుబడులను 95 శాతానికిపైనే నిర్వహించడాన్ని గమనించొచ్చు.

మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తూ పెట్టుబడులను రంగాలవారీగా మార్పులు చేర్పులు మాత్రం చేస్తుంది. 2013లో సాఫ్ట్‌వేర్, కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ను ఎక్కువగా నమ్ముకుంది. 2014లో ఆటో రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో పెట్టుబడులను స్థిరంగా కొనసాగించడం, 2017లో సైయంట్‌లో వాటాలను పెంచుకోవడం ద్వారా మంచి రాబడులనే సొంతం చేసుకుంది.

ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ బీఎస్‌ఈ 500. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 11.5 శాతంగా ఉంటే, బెంచ్‌ మార్క్‌ (బీఎస్‌ఈ 500) రాబడులు 8.7 శాతం కావడం గమనార్హం. ఈ పథకంలో మూడేళ్ల కాలంలో వార్షిక సగటు రాబడులు 16.8 శాతం, ఐదేళ్లలో 26.3 శాతం చొప్పున ఉన్నాయి. కానీ ఇదే కాలంలో బెంచ్‌ మార్క్‌ రాబడులు 14.6 శాతం, 17.8 శాతంగానే ఉండడం గమనించాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్, ఎల్‌అండ్‌టీ ఇండియా వ్యాల్యూ ఫండ్‌ కంటే పనితీరులో ముందుంది.  

పోర్ట్‌ఫోలియో: ఆటో రంగంలో మారుతి సుజుకీకి ప్రాధాన్యం తగ్గించి తక్కువ విలువల వద్ద లభిస్తున్న ఎంఅండ్‌ఎం, హీరో మోటో కార్ప్‌లకు ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే, విలువలు పెరిగిన ఎంఆర్‌ఎఫ్, ఎౖMð్సడ్‌ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకుంది. కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌లో పెట్టుబడులను పెంచుకుంది. అందులోనూ అధిక విలువల్లో ట్రేడ్‌ అవుతున్న హెచ్‌యూఎల్, గోద్రేజ్‌ కన్జ్యూమర్, డాబర్‌ కంటే ఐటీసీ, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ను నమ్ముకుంది.

మరిన్ని వార్తలు