ఈఎల్‌ఎస్‌ఎస్‌ తక్షణమే ఆరంభిస్తే మంచిది

27 May, 2019 08:10 IST|Sakshi

మార్చి వరకు ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ సహా పలు ఎంపికలు

ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ఆదాకు ఉపకరించే ఈక్విటీలింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. ఏప్రిల్‌ నుంచి ఆరంభించి మార్చి వరకు క్రమానుగతంగా ప్రతీ నెలా ఎంపిక చేసుకున్న ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఏడాది చివర్లో ఆందోళన పడక్కర్లేదు. పైగా ఎంపిక విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండాచూసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ, యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ సహా పలు ఫండ్స్‌ ఉన్నాయి.  

పన్ను ఆదా
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తం పెట్టుబడులపై పన్ను మినహాయింపు అవకాశం ఉంటుంది. సెక్షన్‌ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ కూడా ఒకటి. అన్ని పన్ను ఆదా సాధనాల్లోనూ తక్కువ లాకిన్‌ పీరియడ్‌ (మూడేళ్లు) ఉన్నది కూడా ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే. పైగా ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం. మార్కెట్‌ క్యాప్‌తో సంబంధం లేకుండా మంచి రాబడులకు అవకాశం ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేసే సౌలభ్యం ఈ ఫండ్స్‌ మేనేజర్లకు ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల లక్ష్యాలకు సరిపడా సంపదను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో వచ్చే లాభం రూ.1 లక్ష వరకు పన్ను ఉండదు. అంతకుమించితే ఆ మొత్తంపై కేవలం 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నెలా రూ.12,500 మొత్తాన్ని సిప్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే 12 నెలల్లో మొత్తం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసినట్టవుతుంది.  పన్ను ప్రయోజనం పరంగా ఇది అత్యుత్తమ విధానం.

సరైన పథకం
ముఖ్యంగా పన్ను ఆదా ప్రయోజనం ఒక్కటే ప్రాముఖ్యం కాదు. మంచి రాబడులను ఇచ్చే పథకాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆ విధంగా చూసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల చరిత్ర ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌లో చూడొచ్చు. మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సగటున స్థిరమైన రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో వార్షికంగా 10.54 శాతం, పదేళ్లలో వార్షికంగా 14.3 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు