గిడ్డంగులపై రూ.43వేల కోట్ల పెట్టుబడి

27 Mar, 2018 01:57 IST|Sakshi

2020 నాటికి 2 లక్షల ఉద్యోగ అవకాశాలు: జేఎల్‌ఎల్‌

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ వృద్ధి చెందటం, జీఎస్‌టీ అమల్లోకి రావడం తదితర అంశాల నేపథ్యంలో గిడ్డంగుల రంగంలోకి 2020 నాటికల్లా రూ. 43,000 కోట్ల మేర పెట్టుబడులు రావచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో 2 లక్షల మేర ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఒక నివేదికలో పేర్కొంది. గిడ్డంగుల్లో సరుకు నిల్వల పరిమాణం 2017లో 14 కోట్ల చదరపు అడుగులుగా ఉండగా... 2020 నాటికి 24.7 కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని జేఎల్‌ఎల్‌ పేర్కొంది.

కోల్డ్‌ స్టోరేజి, వ్యవసాయ ఉత్పత్తుల వేర్‌హౌసింగ్‌లోకి రూ. 7,500 కోట్లు, కంటైనర్‌ స్టోరేజి విభాగంలోకి రూ. 500 కోట్లు రాగలవని అంచనా. వేర్‌హౌసింగ్‌ వృద్ధితో ఎక్కువగా ప్రథమ, ద్వితీయ శ్రేణి చుట్టుపక్కల ప్రాంతాలు లబ్ధి పొందుతాయని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈవో రమేశ్‌ నాయర్‌ తెలిపారు. గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ విభాగాలు ఇటీవలి కాలంలో భారీగా వృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పారు.

2014 నుంచి చూస్తే.. వేర్‌హౌసింగ్‌ రంగంలో ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులు రూ. 1,25,000 కోట్ల మేర వచ్చాయని నాయర్‌ వివరించారు. 2017లో మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్‌హౌసింగ్‌లోకి వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ వాటా దాదాపు పది శాతం ఉంటుందని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగగలదని నాయర్‌ తెలిపారు.


 

మరిన్ని వార్తలు