ఔషధాలను విక్రయిస్తున్నందుకు స్నాప్‌డీల్‌పై విచారణ

10 Jan, 2019 01:18 IST|Sakshi

బెంగళూరు: ఆన్‌లైన్‌లో నియంత్రిత ఔషధాలను చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన విచారణ చర్యలు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‘‘షెడ్యూల్డ్‌ హెచ్‌ డ్రగ్‌ ‘సుహాగ్రా 100’ ప్రదర్శన, విక్రయం, పంపిణీ చేస్తున్నందుకు గాను స్నాప్‌డీల్, ఆ సంస్థ సీఈవో కౌర్‌బాహల్, సీవోవో రోహిత్‌కుమార్‌ బన్సాల్‌కు వ్యతిరేకంగా విచారణ చర్యలు తీసుకునేందుకు బెళగావికి చెందిన అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ను అనుమతిస్తూ డిసెంబర్‌ 21న ఆదేశాఉలు ఇవ్వడం జరిగింది. ఈ ఔషధాన్ని ఓవర్‌ ద కౌంటర్‌ విక్రయించకూడదు. ఇది ఔషధ, సౌందర్య ఉత్పత్తుల నిబంధనలకు వ్యతిరేకం’’అని కర్ణాటక డ్రగ్‌ కంట్రోలర్‌ అమరేష్‌ తుంబగి బుధవారం మీడియాకు తెలిపారు. లుథినాయాకు చెందిన హెర్బల్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ యజమాని, ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా విచారణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. లైంగిక ఉద్దీపనానికి వినియోగించే సుహాగ్ర ఔషధాన్ని వైద్యుల సిఫారసు లెటర్‌ లేకుండా విక్రయించకూడదని  స్పష్టం చేశారు. 

చట్టానికి సహకరిస్తాం: స్నాప్‌డీల్‌
ఈ విషయానికి సంబంధించి తమకు ఎటువంటి సమచారం లేదని, విచారణ అధికారులకు సహకారం అందిస్తామని స్నాప్‌డీల్‌ ప్రకటన జారీ చేసింది. ‘‘స్నాప్‌డీల్‌ అనేది మధ్యవర్తి. విక్రేతలను, కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. షెడ్యూల్డ్‌ హెచ్‌ విభాగంలోని ఔషధాలను విక్రయించకుండా నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి విక్రేతలు ఇకపై అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తాం’’ అని స్నాప్‌డీల్‌ అధికార ప్రతినిధి ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసేందుకు తమ వైపు నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.   

మరిన్ని వార్తలు