గోల్డ్ రష్@ ధన్‌తేరాస్

22 Oct, 2014 01:10 IST|Sakshi
గోల్డ్ రష్@ ధన్‌తేరాస్

చాలా రోజులకు కిటకిటలాడిన దుకాణాలు  
ఆఫర్లతో ఆకట్టుకున్న జువెలర్లు


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధన్‌తేరాస్‌కు ఆభరణాల దుకాణాలు కిటకిటలాడాయి. నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన షాపులు కస్టమర్లతో సందడిగా మారాయి. ధన్‌తేరాస్ సెంటిమెంట్‌కుతోడు బంగారం ధర తక్కువగా ఉండడం, జువెలర్ల ఆకర్షణీయ ఆఫర్లు.. వెరశి దేశవ్యాప్తంగా మంగళవారం పసిడి మెరుపులు మెరిపించింది. నాణేలతోపాటు అన్ని రకాల ఆభరణాలు అమ్ముడయ్యాయి. అయితే అమ్మకాలు గతేడాది కంటే తక్కువే నమోదయ్యాయి. ధన్‌తేరాస్ రాకతో కొంత ఊరట లభించినట్టు అయిందని వ్యాపారులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి మజూరీ చార్జీలను జువెలర్లు గణనీయంగా తగ్గించారు. బంగారం, వెండి నాణేలను బహుమతిగా ఇచ్చిన సంస్థలూ ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.27,850 వద్ద ఉంది.

మళ్లీ పెరుగుతుందని..
2013 సెప్టెంబర్‌లో 68.25 కోట్ల డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3.75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత పసిడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారనే చెప్పొచ్చు. కారణమేమంటే 2013తో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.28 వేల దిగువకు ఉంది. రూ.25 వేలకు దిగొస్తుందని చాలా మంది కస్టమర్లు కొన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ ధర పెరిగితే ఎలా అని భావించి దుకాణాల వైపు అడుగులేశారు. ఉద్యోగాలు చేసే మహిళలతో సాయంత్రం నుంచి హడావుడి పెరిగిందని ఆర్‌ఎస్ బ్రదర్స్ ప్రతినిధి నాగ కిరణ్ తెలిపారు.
 
విజయవంతంగా విక్రయించాం..
ధన్‌తేరాస్‌కు బంగారం డిమాండ్ ఎకానమీ ఆశావాదానికి నిదర్శనమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ పి.ఆర్.సోమసుందరం వ్యాఖ్యానించారు. విధానపర నియంత్రణలు ఈ సీజన్‌లో పసిడి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపాయని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 40 శాతం వృద్ధితో 1.5 లక్షల పీసుల వెండి నాణేలు, 25 వేల పీసుల (1.5 టన్నులు) బంగారు నాణేలు అమ్మినట్టు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా మార్కెటింగ్ ప్రెసిడెంట్ విపిన్ రైనా తెలిపారు. ఈసారి మెరుగైన అమ్మకాలు సాధించామని తనిష్క్ మార్కెటింగ్, రిటైల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కులహళ్లి వెల్లడించారు. పుత్తడి ధరలు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని, కస్టమర్ల సెంటిమెంటూ అధికంగా ఉందని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు