స్టాక్స్‌లో పెట్టుబడులకు పంచ సూత్రాలు

20 Jun, 2020 15:36 IST|Sakshi

చిన్న ఇన్వెస్టర్లకు సూచనలు

మనీష్‌ జైన్‌, ఫండ్‌ మేనేజర్‌..

యాంబిట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌

స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు అనేవి ఎల్లప్పుడూ అధిక రిస్క్‌తో కూడుకున్నవే అంటున్నారు యాంబిట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ మనీష్‌ జైన్‌. ఒక ఇంటర్వ్యూలో స్టాక్‌ మార్కెట్లకు సంబంధించి వ్యక్తిగత పెట్టుబడుల కోసం ఆరు విలువైన సూత్రాలను అమలు చేయమంటూ సూచిస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో క్రమశిక్షణ చూపగలిగితే.. విజయవంతంకావడం అంత కష్టమేమీకాదని చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లు, పెట్టుబడి విధానాలు, కంపెనీల ఎంపిక వంటి అంశాలపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

ఎమోషన్స్‌కు నో
ప్రపంచ దేశాలతో పోలిస్తే.. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లకు ఆదరణ తక్కువే. సాధారణంగా చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రిస్కులు తగ్గించుకంటూ ఈక్విటీలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణను పాటించవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా సొంతంగా పటిష్ట పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేందుకు ప్రయత్నించవచ్చు. మార్కెట్ల కదలికలు, స్వల్పకాలిక లాభాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ముందుకు సాగవలసి ఉంటుంది. అత్యాశ, భయాలను పక్కనపెట్టడం ద్వారా ఇందుకు సక్రమ రీతిలో ఉపక్రమించాలి.

బిజినెస్‌లో భాగస్వామి
ఏదైనా ఒక కంపెనీ షేరుకి కాకుండా బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు యోచించాలి. అంటే ఒక కంపెనీలో వాటా కొనుగోలు చేస్తున్నట్లుకాకుండా.. బిజినెస్‌లో భాగస్వామి అవుతున్నట్లు భావించాలి. ఇందుకు అనుగుణమైన బిజినెస్‌ నిర్వహిస్తున్న కంపెనీని ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా మార్కెట్లో ఈ బిజినెస్‌కున్న అవకాశలు, ప్రొడక్టులకు గల డిమాండ్‌ వంటి అంశాలను ఆరా తీయడం మేలు. కంపెనీ బిజినెస్‌ చేస్తున్న పరిశ్రమ తీరుతెన్నులను అంచనా వేయడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. సవాళ్లు ఎదురైనప్పుడు కంపెనీ నిలదొక్కుకునే అవకాశాలపైనా అవగాహన అవసరం.

యాజమాన్యం
ఎంపిక చేసుకున్న కంపెనీని నిర్వహిస్తున్న యాజమాన్య నిబద్ధతను పరిశీలించండి. పారదర్శక కార్పొరేట్‌ పాలనకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌ కలిగిన కంపెనీలకు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ప్రత్యర్థి కంపెనీలతో పోటీ, యాజమాన్య వ్యూహాలు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అధిక మార్కెట్‌ వాటా కలిగి ఉండటంతోపాటు.. పోటీలో ముందుండే కంపెనీలు సమస్యల్లోనూ నిలదొక్కుకోగలుగుతాయి. 

దీర్ఘకాలానికి
సాధారణంగా స్టాక్‌ మార్కెట్లలో సంపద సృష్టి దీర్ఘకాలంలోనే జరుగుతుంటుంది. ఎంపిక చేసుకున్న కంపెనీలు లేదా బిజినెస్‌లలో దీర్ఘకాలం కొనసాగేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఈక్విటీ మార్కెట్ల ద్వారా లభించే పూర్తి రిటర్నులను అందుకునేందుకు వీలుంటుంది. సాధారణంగా ఒక బిజినెస్‌లో భాగస్వామికావడం అంటే దీర్ఘకాలిక దృష్టితోనే ముందుకు వెళతాంకదా? అయితే స్వల్ప కాలిక లాభాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇలాంటి సమయాల్లో క్రమశిక్షణగా మెలగవలసి ఉంటుంది. మార్కెట్లు లేదా షేరు కదలికలపై దృష్టి పెట్టకుండా సరైన ఫండమెంటల్స్‌ కలిగిన కంపెనీలకే కట్టుబడి ఇన్వెస్ట్‌ చేయడం మేలు. 

లక్ష్యం ముఖ్యం
రిటర్నులపై ఆశలతో ఇన్వెస్ట్‌ చేయడం సరికాదు. ఒక పర్పస్(లక్ష్యం) కోసం ఇన్వెస్ట్‌ చేయండి. పటిష్ట కంపెనీలలో పెట్టుబడి చేస్తే దీర్ఘకాలంలో రాబడులు అందుతాయి. అయితే రిటర్నులు అనేది ప్రధానంకాదు. ఎందుకు ఇన్వెస్ట్‌ చేస్తున్నామనేది కీలకం. ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా గోల్‌ను సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు లిక్విడిటీ అవసరమున్న వ్యక్తి ఇల్లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే.. మెరుగైన రిటర్నులకు వీలున్నప్పటికీ లక్ష్య సాధనలో ఉపయోగపడకపోవచ్చు.

మరిన్ని వార్తలు