2008 సంక్షోభం- 2020లో పాఠాలు

22 Jun, 2020 14:55 IST|Sakshi

2008లో ఆర్థిక సంక్షోభం

2020లో అనారోగ్య సవాళ్లు

స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌

దీర్ఘకాలిక ధృక్పథం ఉత్తమం

డైవర్సిఫికేషన్‌తో అధిక లాభాలు

ఇన్వెస్టర్లకు విశ్లేషకుల సూచనలు

పన్నెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నుంచి పలు పాఠాలను నేర్చుకోవచ్చని స్టాక్‌ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2008-09లో సబ్‌ప్రైమ్‌ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇటీవల ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రెండు నెలల క్రితం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అయితే ఫెడరల్ రిజర్వ్‌, ఈసీబీ, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ తదితర కేంద్ర బ్యాంకుల బారీ సహాయక ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ వెల్లువెత్తి మార్కెట్లు వేగవంతంగా బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. దేశీయంగానూ కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. ఈక్విటీలలో పెట్టుబడులు అంటే అధిక రిటర్నులు, అత్యంత రిస్కుతో కూడుకున్న వ్యహహారమన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేసే అంశంలో చిన్న ఇన్వెస్టర్లు  గతం నుంచి పలు విషయాలను అభ్యసించి అమలు చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.  ఎడిల్‌వీజ్‌ వెల్త్‌మేనేజ్‌మెంట్‌ నిపుణులు రాహుల్‌ జైన్‌ తదితర విశ్లేషకులు ఇంకా ఏమంటున్నారంటే..

దీర్ఘకాలానికి
స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలు దీర్ఘకాలిక దృష్టితో తీసుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఇండెక్స్‌ ఆధారిత రిటర్నులను ఆశించినప్పటికీ  ఆటుపోట్లను తట్టుకుని అధిక కాలం కొనసాగితే భారీ లాభాలకు అవకాశముంటుంది. నిజానికి ఏవేని కారణాలతో మార్కెట్లు పతనమయ్యే సందర్భాలలో ఇన్వెస్టర్లను నిరాశావాదం ఆవహిస్తుంది. ఇది అనాలోచిత నిర్ణయాలకు కారణమవుతుంది. 2008లో  తొలుత మార్కెట్లు పతనమయ్యాయి. తదుపరి 2009లో వెనువెంటనే భారీ ర్యాలీ చేశాయి. సంక్షోభ సమయాల్లో పెట్టుబడి అవసరంలేకపోతే.. దీర్ఘకాలం కొనసాగడం మేలు. మిగులు సొమ్ముంటే.. మరిన్ని పెట్టుబడులు చేపట్డం దీర్ఘకాలంలో ప్రయోజనాన్నికలిగిస్తుంది.

నాణ్యత ప్రధానం
స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రధానంగా నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవడం కీలకంగా నిలుస్తుంది.  పటిష్ట ఫండమెంటల్స్‌, బలమైన యాజమాన్యం, బిజినెస్‌లకున్న అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. బ్యాలన్స్‌షీట్‌, క్యాష్‌ఫ్లో వంటి అంశాలు కంపెనీ ఫండమెంటల్స్‌ను వెల్లడిస్తాయి. సంక్షోభ సమయాల్లోనూ నిలదొక్కుకోగల వ్యూహాలు, ప్రోడక్టులకున్న డిమాండ్‌ వంటి అంశాలను అధ్యయనం చేయాలి.

డైవర్సిఫికేషన్‌
నిజానికి 2008 జూన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ సెప్టెంబర్‌కల్లా ప్రభావం మరింత కనిపించడం ప్రారంభమైంది.  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ లేమన్‌ బ్రదర్స్‌ దివాళా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లకు షాకిచ్చింది. అప్పట్లో ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకే అధిక శాతం కేటాయింపులు చేపట్టిన ఇన్వెస్టర్లకు షాక్‌ తగిలింది. సాధారణంగా భవిష్యత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోగల, ఆయా విభాగాల్లో మంచి మార్కెట్‌ వాటా కలిగిన రంగాలు, కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, వినియోగం, హెల్త్‌కేర్‌ వంటి రంగాలు ఇన్వెస్టర్లకు కొంతమేర రక్షణాత్మక రంగాలుగా భావించవచ్చు.

పరిస్థితులు వేరు
దశాబ్ద కాలం క్రితం ఫైనాన్షియల్‌ అంశాలు సంక్షోభానికి కారణం కారణంగా ప్రస్తుతం కరోనా వైరస్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థికపరంగానూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్త లాక్‌డవున్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థలు నీరసిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల మద్దతుతో వచ్చే ఏడాదికల్లా ప్రపంచ జీడీపీ పుంజుకునే వీలుంది. అదీకాకుండా కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ వెలువడితే.. మార్కెట్లు మరింత వేగమందుకోవచ్చు. 

మరిన్ని వార్తలు