లాజిస్టిక్స్‌లో పెట్టుబడుల వెల్లువ 

31 Jul, 2018 00:59 IST|Sakshi

2025 నాటికి  రూ. 34.5 లక్షల కోట్లు

కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు      

న్యూఢిల్లీ: లాజిస్టిక్స్‌ రంగంలో 2025 నాటికి 500 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 34.5 లక్షల కోట్లు) పెట్టుబడులు రాగలవని వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు చెప్పారు. దీంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. అలాగే దేశీయంగా వ్యాపారాలకు, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోగలవని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ రూపొందించిన ఇండియా లాజిస్టిక్స్‌ లోగోను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే లాజిస్టిక్స్‌ వ్యయాలు భారత్‌లో అత్యధికంగా.. స్థూల దేశీయోత్పత్తిలో 14 శాతంగా ఉన్నాయి.  

‘2025 నాటికి ఇన్‌ఫ్రా సహా లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు 500 బిలియన్‌ డాలర్లకు చేరతాయి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటాను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో లాజిస్టిక్స్‌దే కీలక పాత్ర’ అని ప్రభు చెప్పారు. భారీ లాజిస్టిక్స్‌ వ్యయాలు.. పోటీ తత్వంపైనా, సరకు రవాణాపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. లాజిస్టిక్స్‌కి సంబంధించిన వర్గాలన్నింటినీ ఒకే చోట చేర్చేలా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా జాతీయ లాజిస్టిక్స్‌ పోర్టల్‌ను తయారు చేస్తోందని వివరించారు. ఎగుమతి.. దిగుమతి వ్యయాలు, దేశీయంగా వాణిజ్య వ్యయాలను తగ్గించేందుకు సమగ్రమైన వ్యూహాన్ని కూడా రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సెంటర్‌ ఫర్‌ లాజిస్టిక్స్‌ ఏర్పాటుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)తో లాజిస్టిక్స్‌ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.    

>
మరిన్ని వార్తలు