భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తాం

23 Feb, 2018 00:24 IST|Sakshi

పదేళ్లలో 10 రెట్లు వృద్ధి లక్ష్యం

ఉబెర్‌ సీఈవో డారా ఖోస్రోషాహి

న్యూఢిల్లీ: ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్‌’ తాజాగా భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘ఇండియా మాకు చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రధానమైన మార్కెట్‌ కూడా. ఇక్కడ వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 రెట్లు వరకు వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని ఉబెర్‌ సీఈవో డారా ఖోస్రోషాహి తెలిపారు. తొలిసారి భారత్‌లో పర్యటిస్తోన్న ఆయన.. సంస్థ ప్రధాన ఇన్వెస్టర్‌ అయిన సాఫ్ట్‌బ్యాంక్‌ సలహాలను స్వీకరించబోమనే సంకేతాలిచ్చారు.

కంపెనీ వ్యూహాలను బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. ‘సాఫ్ట్‌బ్యాంక్‌కు ఒక అభిప్రాయం ఉండొచ్చు. అయితే అదే అంతిమం కాదు. సంస్థలో చాలా అభిప్రాయాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్లు, వృద్ధి వంటి అంశాల పరంగా చూస్తే కంపెనీ సంతులిత ప్రొఫైల్‌ను కలిగి ఉండాలని తెలిపారు. ఉబెర్‌ ఇప్పటికే బలమైన మార్కెట్‌ కలిగిన దేశాలకు తిరిగి వెళ్లాలని, లాభదాయకతపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సాఫ్ట్‌బ్యాంక్‌ ఇటీవల అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఉబెర్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రధాన వాటాదారు. ఈ సంస్థకు ఉబెర్‌ ప్రత్యర్థి ఓలాలోనూ వాటా ఉంది.  

ఇక్కడి మార్కెట్‌పై నమ్మకముంది..
భారత్‌లో ఎంత మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తారనే విషయాన్ని మాత్రం డారా ఖోస్రోషాహి వెల్లడించలేదు. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెడతామని, అలాగే వీటిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ‘భారత్‌లో మా వ్యాపారం లాభదాయకంగా ఏమీ లేదు. అయినా ఇక్కడి మార్కెట్‌పై నమ్మకంగా ఉన్నాం. అందుకే పెట్టుబడులను కొనసాగిస్తాం’ అని తెలిపారు.

ఉబెర్‌ గ్లోబల్‌ ట్రిప్స్‌లో ఇండియా 10 శాతానికిపైగా వాటాను కలిగి ఉందని, రానున్న రోజుల్లో ఈ వాటా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. భారత్, లాటిన్‌ అమెరికా వంటి మార్కెట్లు రానున్న కాలంలో ఉబెర్‌కు అపార వృద్ధి అవకాశాలను అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా డారా ఖోస్రోషాహి తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని, ఇతర ప్రముఖులను కలిసే అవకాశముంది. ఇక ఇండియాలో 29 పట్టణాల్లో ఉబెర్‌కు దాదాపు 3 లక్షల మంది డ్రైవర్‌ పార్ట్‌నర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు