ఇన్వెస్టర్ల సంపద...

7 Oct, 2014 00:28 IST|Sakshi
ఇన్వెస్టర్ల సంపద...

ముంబై: ఈ ఏడాది జనవరి మొదలు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 23 లక్షల కోట్లకుపైగా పెరిగింది. వెరసి మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) దాదాపు రూ. 94 లక్షల కోట్లకు చేరింది. 2013 డిసెంబర్ 31 నుంచి అక్టోబర్ 1 వరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25% పుంజుకోగా, ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు రూ. 23.3 లక్షల కోట్లమేర జమయ్యింది.

 అయితే 2013 ఏడాదికి ఇన్వెస్టర్ల సంపద కేవలం రూ. లక్ష కోట్లు మాత్రమే పెరగడంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 70.44 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, ప్రస్తుతం బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 93.77 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా రూ. కోటి (100 లక్షల) కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకునేందుకు చేరువైంది.

ఈ మైలురాయిని అందుకోవాలంటే ఇకపై ఇన్వెస్టర్ల సంపద కేవలం రూ. 6.22 లక్షల కోట్లు పుంజుకుంటే సరిపోతుంది! 2013 డిసెంబర్ 31 నుంచి చూస్తే అక్టోబర్ 1 వరకూ సెన్సెక్స్ 25.5% పురోగమించింది. ఈ బాటలో సెప్టెంబర్ 8న చరిత్రను సృష్టిస్తూ సెన్సెక్స్ తొలిసారి 27,320 పాయింట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపద పుంజుకోవడానికి లిస్టెడ్ కంపెనీల సంఖ్య పెరగడం కూడా ఒక కారణమని స్టాక్ నిపుణులు చెప్పారు. ప్రస్తుతం బీఎస్‌ఈలో 5,485 కంపెనీలు లిస్టింగ్ పొందాయి.

 రూ. లక్ష కోట్ల కంపెనీలు: సెన్సెక్స్‌లో భాగమైన కొన్ని బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ విడిగా రూ. లక్ష కోట్లను అధిగమించడం విశేషం. ఈ జాబితాలో టీసీఎస్, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, విప్రో, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ ఉన్నాయి. కాగా, టీసీఎస్ రూ. 5,43,684 కోట్ల మార్కెట్ విలువతో అగ్రభాగాన నిలుస్తోంది.

 సుస్థిర ప్రభుత్వం ఎఫెక్ట్
 సానుకూల సెంటిమెంట్‌కుతోడు, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం మార్కెట్ల వృద్ధికి ప్రధానంగా దోహదపడింది. భారీ స్థాయిలో తరలివస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు మార్కెట్లకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  దేశీ స్టాక్ మార్కెట్లు అత్యంత బుల్లిష్‌గా ఉన్నాయని, ప్రస్తుతం స్థిరీకరణ(కన్సాలిడేషన్) దశ కొనసాగుతున్నదని, రానున్న రోజుల్లో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఈక్విటీ నిపుణుడొకరు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 83,438 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు