ఈక్విటీలే ముద్దు.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వద్దు

15 May, 2018 00:11 IST|Sakshi

పసిడి ఫండ్స్‌లో పెట్టుబడులు డౌన్‌

ఏప్రిల్‌లో రూ.54 కోట్ల ఉపసంహరణ  

న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్‌చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్‌లో 14 గోల్డ్‌ లింక్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి మరో రూ. 54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని అసెట్స్‌ విలువ రూ. 4,802 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీముల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.

అటు లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ.1.16 లక్షల కోట్లు చేరాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 62 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల్లోకి రూ. 1.4 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో గత నెలాఖరు నాటికి ఫండ్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 21.36 లక్షల కోట్ల నుంచి రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది.

గడిచిన అయిదేళ్లుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్‌ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2012–13లో రూ. 1,414 కోట్ల మేర పెట్టుబడులు చూసిన గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఆ తర్వాత నుంచి ఉపసంహరణలే ఎక్కువగా ఉంటున్నాయి. 2005 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, 2011–12లో రికార్డు స్థాయిలకు చేరిన పసిడి .. 2012లో క్షీణించింది. అప్పట్నుంచి ఔన్సుకి (31.1 గ్రాములు) 1,100–1,400 డాలర్ల శ్రేణిలో తిరుగాడుతోందని మార్నింగ్‌స్టార్‌ మేనేజర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ కౌస్తుభ్‌ బేలాపుర్కర్‌ తెలిపారు. ఒకవైపు పసిడి ఇలా ఒకే శ్రేణిలో తిరుగాడుతుండటం, మరోవైపు ఈక్విటీలు మెరుగ్గా రాణిస్తుండటం తదితర అంశాల కారణంగా దేశీ ఇన్వెస్టర్లు .. గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉంటున్నారని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు