బడ్జెట్‌ ప్రభావం, ఆర్‌బీఐ సమీక్షపైనే దృష్టి..

3 Feb, 2020 05:50 IST|Sakshi

నిరాశపరిచిన బడ్జెట్‌ పతనం ఈ వారంలోనూ కొనసాగే అవకాశం: రెలిగేర్‌ బ్రోకింగ్‌

మంగళవారం నుంచి 3 రోజులపాటు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష

టైటాన్, భారతి ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, ఐషర్‌ మోటార్స్, పీఎన్‌బీ ఫలితాలు ఈవారంలోనే..

ముంబై: వారాంతాన జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 988 పాయింట్లు (2.43 శాతం)నష్టపోయి 39,736 వద్ద ముగియగా.. నిఫ్టీ 300 పాయింట్లు (2.51 శాతం) కోల్పోయి 11,662 వద్దకు పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచిన కారణంగా గత 11 ఏళ్లలో లేనంతటి భారీ పతనాన్ని ప్రధాన సూచీలు నమోదుచేశాయి. గడిచిన 16 నెలల్లో ఎన్నడూ లేని అత్యంత భారీ పతనం శనివారం నమోదైంది. కేంద్రం బడ్జెట్‌ మెప్పించలేకపోయినందున అమ్మకాల ఒత్తిడి ఈ వారంలోనూ కొనసాగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ అంశాలు ప్రతికూలంగా ఉండడం, ఇదే సమయంలో బడ్జెట్‌ ఏ మాత్రం ఆదుకోలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో అమ్మకాలు కొనసాగే అవకాశం ఉందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వీపీ రీసెర్చ్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. వృద్ధికి సంబంధించి చెప్పుకోదగిన చర్యలేమీ నిర్మలా సీతారామన్‌ ప్రకటించకపోవడం, కొత్త పన్నుల విధానం ఈక్విటీ పెట్టుబడులను నిరాశపరిచే విధంగా ఉండడం అనేవి మార్కెట్‌కు ప్రతికూల అంశాలుగా ఉన్నాయని ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుజన్‌ హజ్రా విశ్లేషించారు. బీమా రంగంపై బడ్జెట్‌ ప్రభావం అధికంగా ఉండనుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు.  

ఆర్‌బీఐ పాలసీ ఆదుకునేనా..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమీక్ష ఈ వారంలోనే జరగనుంది. తాజా బడ్జెట్‌ అంశాలు, భవిష్యత్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ద్రవ్యపరపతి విధానాన్ని ఎంపీసీ యథాతథంగా కొనసాగించేందుకు ఆస్కారం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంబంధించి ఏవైన ఆశాజనక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ చేతులు కట్టేసిన కారణంగా వడ్డీ రేట్లలో మాత్రం మార్పునకు అవకాశం లేనట్లేనని భావిస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎకనామిస్ట్‌ దీప్తి    మాథ్యూ వెల్లడించారు.  

700 కంపెనీల ఫలితాలు..
భారతి ఎయిర్‌టెల్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, సన్‌ ఫార్మా, హీరో మోటోకార్ప్, ఐషర్‌ మోటార్స్, టైటాన్‌ కంపెనీ, లుపిన్, హెచ్‌పీసీఎల్, సిప్లా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, టీవీఎస్‌ మోటార్, ఎం అండ్‌ ఎం, బ్రిటానియా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, ఉజ్జీవన్‌ ల్యాబ్స్‌ , టాటా గ్లోబల్, అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్లు్య ఎనర్జీ, గుజరాత్‌ గ్యాస్, డీఎల్‌ఎఫ్, కాడిలా హెల్త్‌కేర్, బాష్, బాటా, ఎన్‌ఎండీసీ, మహానగర్‌ గ్యాస్, యుసీఎల్, ఎసీసీ, వోల్టాస్‌ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి.  

జనవరిలో రూ.1,003 కోట్ల పెట్టుబడి...  
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జనవరిలో ఈక్విటీ మార్కెట్లో రూ.12,122 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ. 11,119 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వీరి నికర పెట్టుబడి రూ.1,003 కోట్లకు పరిమితమైంది. మరోవైపు వరుసగా 5వ నెల్లోనూ భారత మార్కెట్‌లో వీరి పెట్టుబడి కొనసాగింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ .7,548 కోట్లు, అక్టోబర్‌లో రూ .12,368 కోట్లు, నవంబర్‌లో రూ .25,230 కోట్లు, డిసెంబర్‌లో రూ .7,338.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది.  

మరిన్ని వార్తలు