చిక్కుల్లో చిదంబరం: బుక్‌ చేసిన ఇంద్రాణి

1 Mar, 2018 09:17 IST|Sakshi
ఇంద్రాణి ముఖర్జీ ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ:  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ  ఆర్థికమంత్రి పీ చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. బుధవారం చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్నిచెన్నైలో సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, తాజాగా ఇంద్రాణి ముఖర్జీ స్టేట్‌మెంట్‌  చర్చనీయాంశమైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తన కుమారుడు కార్తీకి సహాయం చేయమని  కోరారని ఇంద్రాణి ముఖర్జీ దర్యాప్తు సంస్థ విచారణలో పేర్కొన్నట్టుగా వివిధ మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలోని హోటల్ హయత్‌లో కార్తీని కలుసుకున్నట్టుగా కూడా ఆమె వెల్లడించారు.  అలాగే కార్తీ చిదంబరానికి చెందిన విదేశీ, స్వదేశీ సంస్థలకు చెల్లించిన ముడుపులకు  (రూ.4.5 కోట్లు) సంబంధించి ఐఎన్‌ఎక్స్‌  న్యూస్  మాజీ డైరెక్టర్ పీటర్‌ ముఖర్జీ సంతకం చేసిన నాలుగు ఇన్‌వాయిస్‌లను  ఐఎన్‌ఎక్స్‌ మీడియా సీబీఐకి అందించింది.  వీటిని సీబీఐ, ఈడీ పరిశీలిస్తున్నాయి.

మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసు విచారణ సందర్భంగా ఐఎన్‌ఎక్స్‌  న్యూస్  మాజీ డైరెక్టర్, కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీని  సీబీఐ, ఈడీ తాజాగా ప్రశ్నించాయి.   2007లో  ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందే క్రమంలో  తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని చిదంబరమే తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి  తెలిపినట్టు సమాచారం.  ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

కాగా బుధవారం అరెస్ట్‌  చేసిన కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించడానికి వీలుగా  ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతినిచ్చింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కార్తీకి కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు కార్తీ చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్‌.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఎన్‌డీయే సర్కారు ఇబ్బందులు పెడుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు