ఫాలో ఆన్‌ ఇష్యూకి ఐఓబీ

18 Feb, 2020 07:52 IST|Sakshi

రెండు, లేదా మూడో క్వార్టర్లో : ఈడీ అజయ్‌ శ్రీవాస్తవ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు (ఐఓబీ) వచ్చే ఆర్థిక సంవత్సరం ఫాలో ఆన్‌ ఇష్యూకు (ఎఫ్‌పీవో) రానుంది. ఈ నిర్ణయం ఇంకా బోర్డ్‌ పరిధిలోనే ఉందని, అది పూర్తయ్యాక.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీ అనుమతుల కోసం వెళతామని.. కచ్చితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఎఫ్‌పీవోకి రావాలని నిర్ణయించామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎఫ్‌పీఓ ద్వారా ఎంత వాటాను కేటాయించాలి? ఎన్ని నిధులు సమీకరించాలి? అనేది బోర్డ్‌ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

50 వేల కోట్లకు ఎంఎస్‌ఎంఈ రుణాలు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లుగా ఐఓబీ ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ను రూ.25 వేల కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు బ్యాంక్‌లకు మూలధన పునరుద్ధరణలో భాగంగా ఐఓబీకి రూ.4,360 కోట్లు క్యాపిటల్‌ను కేటాయించింది కూడా. ప్రస్తుతం ఐఓబీ నికర వడ్డీ మార్జిన్స్‌ను (ఎన్‌ఐఎం) మెరుగుపర్చుకునే స్థితిలో ఉందని.. ప్రస్తుతం 1.94 శాతంగా ఉన్న ఎన్‌ఐఎం ఈ త్రైమాసికంలో 2 శాతానికి చేరుతుందని.. 3–4 త్రైమాసికాల్లో 3 శాతానికి చేరడం ఖాయమని శ్రీవాస్తవ ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ రుణాల మీద ప్రత్యేక దృష్టి సారించామని.. ప్రస్తుతం రూ.31 వేల కోట్లుగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రుణ వ్యాపారం.. వచ్చే 18–24 నెలల్లో రూ.50 వేల కోట్లకు చేరుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు